వసతి గృహాల విద్యార్థులపై సర్కారు అశ్రద్ద
– ఆరోగ్యాల జాగ్రత్తలలో సర్కారు విఫలం
– తాండూరు ఘటనపై మండిపడిన బీజేపీ నేతలు
– జిల్లా కలెక్టర్ ను అడ్డుకుని నిరసన
తాండూరు, దర్శిని ప్రతినితి : వసతి గృహాలు, గురుకుల పాఠశాలల విద్యార్థులపై కాంగ్రెస్ ప్రభుత్వం అశ్రద్ధ వహిస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డారు. తాండూరు పట్టణం సాయిపూర్ లోని గిరిజన వసతి గృహా ఘటనలో అధికారుల నిర్లక్ష్యం, సర్కారు చర్యలను ఖండించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, దిశ కమిటి సభ్యులు అంతారం లలిత, కౌన్సిలర్ సాహు శ్రీలత, పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, జిల్లా నాయకులు వసతి గృహాన్ని సందర్శించేందుకు వెళ్లారు. పోలీసులు లోపలికి అనుమతించలేదు. అదే సమయంలో అక్కడికి వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను నేతలు అడ్డుకున్నారు. జరిగిన సంఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అడిగారు.
అనంతరం యు.రమేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వసతి గృహా విద్యార్థుల పట్ల అశ్రద్ధ వహిస్తుందని విమర్శించారు. భోజనం వికటించి అస్వస్థతకు గురవుతున్నా వారి ఆరోగ్యాల పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. తాండూరులో అనారోగ్యానికి గురైన విద్యార్థినిలను వసతి గృహంలో ఉంచుకుని వైద్యం అందించడం సరైన చర్యలు కావన్నారు. తాండూరు ఘటనపై ప్రభుత్వం, అధికారులు. పాలకులు వహిస్తున్న నిర్లక్ష్యాన్ని ఖండిస్తున్నామని ద్వజమెత్తారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడకపోతే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, నాయకులు దోమ కృష్ణ, నేతలు, కార్యకర్తలు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

