కంది, పసుపు పంటల్లో గంజాయి సాగు
– 61 పాడు మొక్కలు స్వాదీనం చేసుకున్న పోలీసులు
– కోట్‌పల్లి ఎన్నారంలో వెలుగులోకి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: ప్రజలకు ఆహారాన్ని అందించే పంటలు సాగుచేయాల్సిన పొలంలో మత్తులో చిత్తయ్యే పంటలు సాగుచేసిన రైతు గుట్టును రట్టుచేశారు కోట్‌పల్లి పోలీసులు. పంట పొలంలో సాగుచేసిన గంజాయి మొక్కలను స్వాదీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కోట్ పల్లి మండలం ఎన్నారం గ్రామానికి చెందిన మందుల జనార్థన్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 7లో ఉన్న తన వ్యవసాయ పొలంలో పైకి పసుపు, కంది పంటను సాగుచేస్తున్నాడు. అందులోనే గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. విషయం తెలిసిన కొందరు పోలీసులకు పక్కా సమాచారం అందించారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న కోట్‌పల్లి ఎస్ఐ ఆనంద్ తన సిబ్బందితో కలిసి పంట పొలాల్లో అకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పొలంలో 61 గంజాయి మొక్కలను గుర్తించి వాటిని స్వాదీనం చేసుకున్నారు. ఈ మేరకు పొలం యజమాని జనార్థన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ సందర్బంగా ఎస్ఐ ఆనంద్ మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా ఇంకా గంజాయి సాగుచేస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.


