ఏసీబీ ట్రాప్.. అంతా సస్పెన్స్..!
– భూ మార్పిడి లంచంలో ఎవరి ప్రమేయం ఎంత..?
– ఇద్దరి అధికారుల నుంచి సుదీర్ఘ విచారణ
– వారి వారి ఇండ్ల వద్ద ప్రత్యేక బృందాలతో సోదా
– చర్చనీయాంశంగా ఆర్డీఓ అధికారుల అవినీతి వ్యవహారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇద్దరు అధికారులపై ఏసీబీ అధికారులు చేసిన ట్రాప్.. చాలా సస్పెన్స్‌గా మారింది. తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఏఓ దానయ్య, సీనీయర్ అసిస్టెంట్ మాణిక్ రావులు ఓ దరఖాస్తు దారుని వద్ద భూ మార్పిడి కోసం లంచం డిమాండ్ చేసి.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినట్లు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం సర్వేనెంబర్ 369 లోని 6 ఎకరాల 26 గుంటలలో ఎల్ఎఫ్గా ఉన్న భూమిని పట్టా భూమిగా మార్చేందుకు ఆర్డీఓ కార్యాలయ ఏఓ దానయ్య, సీనీయర్ అసిస్టెంట్ మాణిక్ రావులు రూ. 5లక్షలు డిమాండ్ చేశారని అభియోగాలు నమోదయ్యాయి.
ఇందులో భాగంగా రూ. 5లక్షలు లంచం తీసుకుంటుండగా వారు పట్టుబడినట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. సోమవారం సాయంత్రం ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరిపారు. నిజానికి అధికారులను కోడంగల్ పరిధిలో ఓ హోటల్ వద్ద దాడులు నిర్వహించినట్లు అధికార వర్గాలలో ప్రచారం జరుగుతోంది. వారిని డబ్బుతో పాటు అక్కడే అదుపులోకి తీసుకుని తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు తరలించినట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు అధికారులు విచారణ చేపట్టారు. భూమి మార్పిడి కోసం డబ్బులు డిమాండ్ చేసిన వారిలో ఎవరి ప్రమేయం ఎంత ఉందనే విషయమై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
ఓవైపు పట్టుబడిన అధికారులను సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉంచి.. ఆ ఇద్దరు అధికారులకు చెందిన నివాసాలలో ఏసీబీ అధికారులు ప్రత్యేక బృందాలతో సోదాలు నిర్వహించారు. భూ మార్పిడి లంచం వ్యవహారంతో పాటు ఇంకా ఏమైనా ఇతర అవినీతికి పాల్పడ్డారా అనే కోణంలో దాడులు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి ఏఓ దానయ్య, సీనీయర్ అసిస్టెంట్ మాణిక్ రావులను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠతో పాటు చర్చనీయాంశంగా మారింది.
ఇదికూడా చదవండి…

