రసవత్తరంగా హుజూరాబాద్ ఉప పోరు
– 9 గంటల వరకు 10.50 శాతం పోలింగ్
దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ ఉపఎన్నిక రసవత్తరంగా మారింది. హుజూరాబాద్ ఎన్నికను పలు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో.. ఏమైనా జరుగొచ్చనే అభిప్రాయంతో
ఆ ఎన్నికపై ఈసీ డేగ కన్ను పెట్టింది. నియోజకవర్గంలో హుజురాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల్లో 306 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. హుజూరాబాద్ మండలంలో 61, 673 మంది ఓటర్లు, ఇల్లందకుంటలో 24, 799, జమ్మికుంట 59, 200, వీణవంక 40, 990, కమలపూర్ 51, 282 మంది ఓటర్లు ఉన్నారు.1,715 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. ఉదయం 7గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌లో ఉదయం 9 గంటల వరకు 10.50 శాతం పోలింగ్ నమోదు అయింది.
పోలింగ్ శాతం పెరగవచ్చని అంచనా
హుజురాబాద్ ఉప ఎన్నిక పోరులో ఈసారి పోలింగ్ శాతం పెరగవచ్చని అధికారులు, నాయకులు అంచనా వేస్తున్నారు. 2018 ఎన్నికల్లో హుజురాబాద్‌లో 84.42 శాతం పోలింగ్ జరిగింది. గతంకన్నా 27 వేల మంది ఓటర్లు పెరగడంతో పోలింగ్ శాతం పెరుగుతుందని భావిస్తున్నారు. దీంతో పాటు పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ఓటింగ్ శాతాన్ని పెంచుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఈసీ కార్యాలయం నుంచి నిఘా
హైదరాబాద్ ఈసీ కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తోంది. 306 పోలింగ్ స్టేషన్ లలో వెబ్ కాస్టింగ్ ద్వారా మోనటరింగ్ చేస్తున్నారు ఎన్నికల అధికారులు. ప్రతీ పోలింగ్ బూత్‌ను ఈసీ కార్యాలయం నుంచి పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా 127 సమస్యాత్మక ప్రాంతాలపై ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టింది. పోలింగ్ కోసం 421 కంట్రోల్ యూనిట్లను ఏర్పాటు చేశారు. 891 బ్యాలెట్ యూనిట్లు, 515 వివిప్యాట్లను వినియోగిస్తున్నారు. కాగా, పోలింగ్ విధుల్లో 1,715 మంది సిబ్బంది ఉండగా.. రెండు డోసుల టీకా తీసుకున్న వారినే ఎన్నికల విధుల్లో నియమించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇక ఎన్నికల విధుల కోసం 20 కంపెనీల బలగాలను వినియోగిస్తున్నారు.

