హుజూరాబాద్‌షా ఈటల రాజేందర్
– 24,068 ఓట్ల మెజారిటీతో విజయం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : హుజూరాబాద్ ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి అయిన తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై ఈటల గెలుపొందారు. ఉత్కంఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో 26 రౌండ్ల ఫలితాల్లో రెండు రౌండ్లు మినహా అన్ని రౌండ్లలోనూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యతను ప్రదర్శించారు. టీఆర్ఎస్ మొదట్లో పోస్టల్ బ్యాలెట్‌లో వచ్చిన ఆధిక్యతను ప్రదర్శించింది. ఆ తరువాత వెలువడిన రౌండ్లలో రౌండ్ రౌండ్ కు మెజార్టీ పెంచుకుంటూ ఎన్నికల బరిలో ప్రత్యర్థికి చిక్కకుండా దూసుకుపోయారు. ఆఖరికి ప్రత్యర్థి, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ స్వగ్రామం హిమ్మత్ నగర్, ఆయన అత్తగారి ఊరైన పెద్దపాపయ్యపల్లెనూ ఈటల పాగా వేశారు. గెల్లు శ్రీనివాస్ కంటే కూడా మెజార్టీ ఓట్లను సాధించారు. గెల్లు శ్రీనివాస్ స్వగ్రామమైన హిమ్మత్ నగర్‌లో ఈటల రాజేందర్ 191 ఓట్ల మెజార్టీని సాధించారు. లెక్కింపు పూర్తయ్యే సరిగి ఈటెల రాజేందర్ 24,068 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థిపై విజయం సాధించారు.
