మిషన్‌ నీళ్లు.. మైదానం పాలు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మిషన్‌ నీళ్లు.. మైదానం పాలు..!
– అధికారుల నిర్లక్ష్యానికి ఆనవాలు
– లీకేజీతో వృధా అయిన తాగునీరు
– చెరువుగా మారిన కాలేజీ గ్రౌండ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : అసలే వేసవి కాలం.. రోజు విడిచి రోజు వస్తున్న నీళ్లకు ప్రజలు వ్యథ అనుభవిస్తుంటే.. అధికారుల నిర్లక్ష్యం వల్ల తాగునీరు వృథాగా పారుతోంది. మిషన్‌ భగీరథ నీళ్లు మైదానం నేల పాలైన సంఘటన తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని ప్రభుత్వ కాలేజీ మైదానంలో మిషన్ భగీరథ కింద భారీ ట్యాంకును ఏర్పాటు చేశారు.

పట్టణంలోని పలు కాలనీలకు ఈ ట్యాంకు ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రతిరోజూ సక్రమంగా నీరు సరఫరా కావాల్సి ఉండగా పట్టణంలో ప్రస్తుతం రెండు, మూడు రోజుల కోసారం నీటిని సరఫరా చేస్తున్నారు. పట్టణంలోని కాలనీలలో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు మొద్దు నిద్రలో గడుపుతున్నారు. తాగునీటి సరఫరా పైపులైన్ల లీకేజీల పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పట్టణంలోని కాలేజీ మైదానంలో మిషన్ భగీరథ ట్యాంకు వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో గురువారం ఉదయం లీకేజీల వల్ల నీరంతా వృధాగా పారింది. గంటల పాటు నీరు వృథాగా పారడంతో కాలేజీ మైదానం చెరువుగా మారింది.

ఈ సంఘటనపై పట్టణ ప్రజలు అధికారుల పనితీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎద్దడి సమయంలో నిర్లక్ష్యం ఏంటీ సార్లు అంటూ మండిపడుతున్నారు. వేసవి కాలంలో తాగునీటి విషయంపై జాగ్రత్తలు తీసుకోవాల్సి పోయి వృథాగా వదిలేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పట్టణంలోని లీకేజీలపై దృష్టి పెట్టి.. నీటి సరఫరాపై జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదికూడా చదవండి…

కుల వృత్తుల కుదేలు..!

సమ్మర్ సపోటా.. వేరీ పవర్..!