ఇసుక మాఫీయా.. దౌర్జన్యం..!
– అక్రమ రవాణాపై సమాచారం ఇచ్చిన వ్యక్తిపై దాడి
– అనుచరులతో దాడి చేయించారని బాధితుడి ఆవేధన
– ప్రాణహాని ఉంది.. కాపాడాలని మొర
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : అక్రమ ఇసుక రవాణాపై పోలీసులకు సమాచారం అందించిన వ్యక్తిపై ఇసుక మాఫియా దౌర్జన్యానికి పాల్పడిన సంఘటన తాండూరు మండలంలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని వీర్ శెట్టిపల్లి గ్రామంలోని కాగ్నానది నుంచి శుక్రవారం అర్ధరాత్రి యాలాల మండలంలోని అగ్గనూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన అనుచరులతో ఇసుక ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుక రవాణా చేపట్టారు.

ఈ అక్రమ ఇసుక రవాణాపై వీర్ శెట్టిపల్లి గ్రామానికి చెందిన ఫిరంగి జర్నప్ప అనే వ్యక్తి డయల్ 100తో పాటు కరణ్ కోట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఇసుక ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్ కు తరలించారు. అక్రమంగా ఇసుక తరలించిన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించిన తనపై అగ్గనూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భీమప్ప తన అనుచరులో దాడి చేయించారని బాధితుడు జర్నప్ప ఆరోపించారు. ఆయనే గత 30 ఏండ్లుగా కాగ్నా నది నుంచి అక్రమంగా ఇసుక రవాణా సాగిస్తున్నారని ఆరోపించారు. దాడి తరువాత ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని శనివారం కూడా కరణ్ కోట్ పోలీస్టేషన్ కు వెళ్లి దాడిచేసిన వారిపై ఫిర్యాదు చేయడం జరిగిందిన తెలిపారు.

అదేవిధంగా తనపై అగ్గనూర్ గ్రామ మాజీ సర్పంచ్ భీమప్ప, అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని మీడియా ముందు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తనకు న్యాయం జరిగేలా చూడాలని తాండూరు డీఎస్పీ కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు.
ఇదికూడా చదవండి…

