కొత్త యేడాదిలోనే భగీరథ ట్రయల్ రన్
– ఆ తరువాతే ధ్వంసమైన రోడ్లకు మోక్షం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటింటికి తాగునీరందించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మిషన్ భగీరథ పనులు తాండూరు పట్టణంలో తుదిదశకు చేరుకుంటున్నాయి. వచ్చేనెల డిసెంబర్ నెలాఖరు నాటికి పనులు పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. పైపులైన్ పూర్తియ వెంటనే ట్రయల్ పనులు ప్రారంభించాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తాండూరు పట్టణంలో రూ. 25 కోట్లతో మిషన్ భగీరథ పనులు
చేపడుతున్నారు. పట్టణంలోని 36 వార్డుల్లో పులైన్ పనులు కొనసాగుతున్నాయి. పట్టణం మొత్తంలో 107 కిలో మీటర్ల పైపులైన్ పనులు చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు 102 కిలో మీటర్ల పైపులైన్ పనులు పూర్తి చేశారు. మరో కిలో మీటర్ల మేర పైపులైన్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ పనులు కొనసాగుతుండగానే మున్సిపల్, భగీరథ అధికారులు ఇంటింటికి నల్లాలను బిగించారు. మిషన్ భగీరథ కింద కొత్తగా అర్హులైన వారికి కూడ కొత్త నల్లా కనెక్షన్లను అందించారు. వచ్చే నెలాఖరునాటికి పైపులైన్ పనులు, నల్లా కనెక్షన్లను పూర్తిచేసేలా అధికారులు దృష్టించారు. కొత్త యేడాదిలో మిషన్ భగీరథ ట్రయల్ రన్‌ను ప్రారంభించనున్నారు. ట్రయల్ రన్ సక్సెస్ అయితే ఇంటింటికి మిషన్ భగీరథ కింద తాగునీరు అందనుంది.
ధ్వంసమై రోడ్లకు మోక్షం
తాండూరు పట్టణంలో మిషన్ భగీరథ కింద పైపులైన్ పనుల వల్ల పట్టణంలోని పలు రోడ్లు అన్ని ధ్వంసం అయ్యాయి.
ప్రధాన రహదారులతో పాటు అన్ని వార్డుల్లో మిషన్ భగీరథ కోసం రోడ్లను ధ్వంసం చేశారు. పైపులైన్ వేసిన తరువాత గోతులను సక్రమంగా పూడ్చక పోవడంతో అవి ప్రమాదకరంగా మారాయి.. పలుచోట్ల ప్రమాదాలు జరిగాయి. దీనిపై అధికారులు పలుమార్లు స్పందించారు. మిషన్ భగీరథ ట్రయల్ రన్ పూర్తయిన తరువాత ధ్వంసమైన రోడ్లను భాగుచేయిస్తామని తెలిపారు. గత రెండు, మూడు నెలలుగా ఇదే సమాధానం వినిపిస్తుంది. తాండూరులో మిషన్ భగీరథ పనులు తుది దశకు చేరుకోవడం ట్రయల్ రన్ తరువాత ధ్వంసమైన రోడ్లకు మరమ్మత్తులు చేయనున్నారు. అయితే ఈ మరమ్మత్తులను మున్సిపల్ నుంచి పూర్తి చేస్తారో.. భగీరథ అధికారుల నుంచి పూర్తి చేయిస్తారో.. స్పష్టంగా తెలియరావడంలేదు.