ఇదేం.. ఇందిరమ్మ రాజ్యం..!
– కాంగ్రెస్ నేతలకే ఇండ్లిస్తారా
– భగ్గుమన్న జీవన్గీ వాసులు
– ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో రచ్చ
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తామని చెప్పి.. కాంగ్రెస్ కార్యకర్తలకు ఇండ్లు ఇవ్వడమే ఇందిరమ్మ రాజ్యమా.. అట్లయితే ఇదేం.. ఇందిరమ్మ రాజ్యమని బషీరాబాద్ మండలం జీవన్గీ గ్రామస్తులు భగ్గుమన్నారు. శనివారం ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల సర్వే కోసం ఏపీఓ పద్మరావు, పంచాయతీ కార్యదర్శి ప్రకాష్ గ్రామానికి వచ్చారు.

గ్రామంలోని లబ్దిదారుల వివరాలను ఆరా తీస్తుండగా గ్రామంలో ఇండ్లు ఉన్న వారినే లబ్దిదారులుగా గుర్తించడం పట్ల ఆందోళనకు దిగారు. 70శాతం మంది అనర్హులుగా ఉన్నప్పటికి ఎంపిక చేయడం పట్ల మండిపడ్డారు. అనర్హులను ఎలా ఎంపిక చేస్తారని నిలదీశారు. ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన బషీరాబాద్ మార్కెట్ కమిటి చైర్మన్ మాధవరడ్డి అండ దండలతో లబ్దిదారుల ఎంపిక చేశారని ఆరోపించారు. ఆయన అనుచరులకు, కాంగ్రెస్ కార్యకర్తలనే ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎంపిక చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లొల్లి చర్చనీయాంశంగా మారింది. పలువురు యువకులు, మహిళలు ఊగిపోతూ పూర్తిగా ఇల్లు లేకుండా కిరాయిలకు ఉంటూ ఉంటున్న వారిని వదిలేసి కాంగ్రెస్ లీడర్ పేర్లను చేర్చడాన్ని గట్టిగా ప్రశ్నించారు. పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తామని చెప్పి.. కాంగ్రెస్ కార్యకర్తలకు ఇండ్లు ఇవ్వడమే ఇందిరమ్మ రాజ్యమా.. అట్లయితే ఇదేం.. ఇందిరమ్మ రాజ్యమని నిలదీశారు. ఇల్లులేని పేదలు, వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని చెప్తుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం అవేమి పట్టవు అన్నట్టుగా వ్యవహరించారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే కల్పించుకొని రీసర్వే చేయించాలని డిమాండ్ చేశారు. వెంటనే కొందరు గ్రామస్తులు జరిగిన సంఘటనపై బషీరాబాద్ ఎంపీడీఓకు ఫిర్యాదు చేసేందుకు మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లారు. అయితే ఈనెల రెండో శనివారం సెలవు దినం కావడంతో వెనుదిరిగి వచ్చారు. గ్రామంలో అర్హులైన లబ్దిదారులను గుర్తించి ఇండ్లు మంజూరు చేసే వరకు పోరాటం చేస్తామని, ఎక్కడా వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు.

ఇదికూడా చదవండి…

