సీఎం సొంత జిల్లాలో రైతులకు అరిగోసలా..?
– ధాన్యం కొనుగోలులో సర్కారు విఫలం
– నిర్లక్ష్యంతో కేంద్రాల్లో మొలకెత్తిన ధాన్యం బస్తాలు
– వారంలోపు కొనుగోలు చేయాలి.. లేదంటే ఆందోళన తప్పదు
– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నూలి శుభప్రద్ పటేల్
– యాలాల జుంటుపల్లిలో కొనుగోలు కేంద్రం పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా వికారాబాద్ లో అన్నదాతలు అరి గోస పడుతున్నారని బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శుభప్రద్ పటేల్ మండిపడ్డారు. శుక్రవారం తాండూరు నియోజకవర్గం యాలాల మండలం జుంటుపల్లి గ్రామంలో గ్రామంలో ఆయన పర్యటించి వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు విఫలం అయ్యిందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. తేమ శాతం లేకుండా చేసేందుకు కల్లాల్లో ఆరబెట్టి స్థానికంగా ఉన్న కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి తీసుకెళ్దామంటే..అక్కడి సిబ్బంది సరిపడా గన్నీ బ్యాగు లు లేవని.. అవి వచ్చిన తర్వాతే ఇస్తామని.. అప్పటివరకు ధాన్యాన్ని కొనుగోలు చేయమని అధికారులు అనడం సరికాదన్నారు. మరోవైపు అకాల వర్షాలు అన్నదాతను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఉదయం వరకు ధాన్యాన్ని ఆరబెట్టగా.. సాయంత్రం సమయంలో వర్షం కురిసి తడిసిపోతుండడంతో అన్నదాత పరిస్థితి ఆందోళనక రంగా మారిందన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ఆయన రైతుల పక్షాన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిది కేవలం రివ్యూలు తప్ప.. ఆచరణలో ఏమీ లేదన్నారు. సీఎం పక్క నియోజకవర్గంలోనే తీరు ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా తీరు ఎలా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుందని అన్నారు. కల్లాలోనే మొలకెత్తుతున్న ధాన్యం కుప్పలు.. రైతుల గుండెల్లో కన్నీరు.. తుడిచేదెవరని ఆయన ప్రభుత్వానికి ప్రశ్నించారు. బోనస్, మద్దతు ధరకు ఆశపడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెస్తే తడిసి ముద్దయి మొలకెత్తడంతో రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కాంటాలు పెట్టకపోవడంతో వర్షాలకు తడిసి మొలకెత్తడం జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం ధాన్యం తూకంలో కోత విధించొద్దని ఆయన కోరారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి తమ వడ్లను సరైన ధరకి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తా ప్రభుత్వానికి శుభప్రద్ పటేల్ ఘాటుగా హెచ్చరించారు.

ఇదికూడా చదవండి…

