తాండూరులో 11 ఏండ్ల బాలిక‌కు క‌రోనా

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

తాండూరులో 11 ఏండ్ల బాలిక‌కు క‌రోనా
– పట్టణంలోని య‌శోధ‌న‌గ‌ర్‌లో క‌ల‌క‌లం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరులో ఓ 11 ఏండ్ల బాలికకు కరోనా నిర్ధారణ అయ్యింది. శనివారం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన పట్టణంలో కలకలం రేపింది. ఈ విషయాన్ని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి పీపీ యూనిట్ ఇంచార్జ్ డాక్టర్ బాస్కర్ వెల్లడించారు. పట్టణంలోని యశోధనగర్ లోని నివాసముంటున్న 11 ఏండ్ల బాలిక శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 6వ తరగతి చదువుతోంది. గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురైంది. కుటుంభీకులు పలు ఆసుప్రతులలో వైద్యం చేయించారు. ఈ క్రమంలో కరోనా లక్షణాలు కనిపించగా ఈనెల 17న బాలికకు రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో కరోనా నెగిటివ్ వచ్చింది. అయినా కూడ లక్షణాలు త‌గ్గ‌క‌పోవ‌డంతో అదే రోజు ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించారు. రెండో సారి నిర్వ‌హించిన ఆర్టీపీసీఆర్ క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో బాలికను హోం ఐసోలేషన్లో ఉంచారు. మరోవైపు బాలిక చదువుతున్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో వైద్యాధికారులు ఆరా తీయగా అనారోగ్యానికి గురైనప్పటి నుంచి బాలిక స్కూల్ కు హాజరు కాకపోవడంతో ఎవ్వరికి ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని గుర్తించారు. ఇదిలా ఉండగా ఈనెలలో తాండూరు పట్టణంలో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నెల మొదట్లో సాయిపూర్కు చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో పాటు ఇటీవల ఇందిరమ్మ కాలనీకి చెందిన మరో మహిళకు కూడ కొవిడ్ నిర్ధారణ అయ్యింది. తాజాగా 11 ఏండ్ల బాలికకు కరోనా పాజిటివ్ కావడంతో, ‘ పట్టణ వాసులను ఆందోళనకు గురిచేసే పరిస్థితి ఏర్పడింది.