ఎక్కడికైనా.. ఎందాకైనా.. తగ్గేదే లే..!

జాతీయం తెలంగాణ రాజకీయం

ఎక్కడికైనా.. ఎందాకైనా.. తగ్గేదే లే..!
– కేంద్రంపై యుద్దానికి సిద్దంకండి
– స్పందించ‌కుంటే గ్రామ స్థాయి నుంచి ఉద్య‌మాలు
– ద‌ర్నాలు చేసే ప‌రిస్థితి కేంద్ర‌మే తెచ్చింది
– మ‌హాద‌ర్నాలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్
హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రైతుల ప్రయోజ‌నాల‌ను ప‌రిర‌క్షించేందుకు ఎక్క‌డికైనా.. ఎందాకైనా వెళ‌తామ‌ని.. కేంద్రంతో యుద్దాసిద్దం.. త‌గ్గేదేలేదంటూ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ రైతుల భ‌రోసా ప్రద‌మైన ప్ర‌సంగం చేశారు. అద్భుతమైన పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నట్టే.. అంతకుమించిన పోరాటాలతో రైతాంగం ప్రయోజనాలు కాపాడుతామని రైతులకి భరోసానిచ్చారు. గురువారం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వ‌ద్ద చేప‌ట్టిన రైతు మ‌హాధ‌ర్నాలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ దీక్షలో వరి కంకులతోపాటు నాగలిని పట్టుకుని కేంద్ర వైఖ‌రికి వ్య‌తిరేకంగా నిర‌స‌న తెలిపారు. ఈ సంద‌ర్భంగా సీఎ కేసీఆర్ మాట్లాడుతూ దేశంలో సీఎం, మంత్రులు ధర్నా చేసే పరిస్థితిని కేంద్రమే తీసుకొచ్చిందన్నారు. గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ 51 గంటల దీక్ష చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. వ్యవ‌సాయ రంగాన్ని కేంద్రం విస్మరిస్తోందన్న కేసీఆర్.. పంజాబ్‌లో ధాన్యం కొనుగోలు చేసిన‌ట్టే తెలంగాణ‌లో ధాన్యం కొనుగోలు చేయాల‌ని కేంద్రాన్ని వేడుకున్నమని, ఈ మేరకు ప్రధాని మోడీకి లేఖ రాసినా.. ఉలుకు ప‌లుకు లేదన్నారు. తెలంగాణ రైతాంగం బాధలు ప్రపంచానికి, దేశానికి తెలియజేసేందుకే ఈ మహా ధ‌ర్నాకు శ్రీకారం చుట్టామ‌న్నారు. తెలంగాణ గ్రామాల్లో కూడా వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తామని, కేంద్రం దిగివ‌చ్చి మ‌న రైతాంగానికి న్యాయం చేసే వ‌ర‌కు పోరాటం కొన‌సాగుతూనే ఉంటుందన్నారు. ఈ ఉద్యమాన్ని ఉప్పెనలా కొన‌సాగిస్తామ‌ని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగం ఉత్పత్తుల‌ను కొనుగోలు చేయాల‌ని, రైతుల ప్రయోజ‌నాల‌ను ర‌క్షించుకోవాల‌ని ఈ యుద్ధాన్ని ప్రారంభించామని సీఎం కేసీఆర్ తెలిపారు. హైద‌రాబాద్ న‌గ‌రంతో ప్రారంభ‌మైన ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. అవ‌స‌ర‌మైతే ఈ లొల్లి ఢిల్లీ దాకా వెళ్తుందన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం ఎక్కడికైనా ఎందాకైనా తగ్గేదే లే అని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రైతాంగానికి అశ‌నిపాతంలా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు దాపురించాయని మండిపడ్డారు. వ్యవ‌సాయం చేసి దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందన్న సీఎం.. కేంద్రం విధానాల వ‌ల్ల మ‌న రైతాంగం దెబ్బతినే పరిస్థితి నెలకొందన్నారు. రైతాంగం, వ్యవ‌సాయం ప‌ట్ల కేంద్ర వైఖ‌రి మార్చుకోవాల‌న్న సీఎం.. రైతు నిరంకుశ చ‌ట్టాల‌ను విర‌మించుకోవాల‌న్నారు. కేంద్ర తీసుకువచ్చిన కొత్త విద్యుత్ విధానాన్ని మార్చుకోవాల‌ని అనేక‌సార్లు చెప్పామని.. ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పంద‌న రాలేదన్నారు. ఈ నేప‌థ్యంలోనే కేంద్రంపై యుద్ధానికి శ్రీకారం చుట్టామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ యుద్ధం ఈరోజుతో ఆగిపోదని.. ఇది ఆరంభం మాత్రమే. అంతం కాదు.. మ‌న హ‌క్కులు సాధించే వ‌ర‌కు, రైతుల ప్రయోజ‌నాలు ప‌రిర‌క్షించేంత వ‌ర‌కు, ఉత్తర భార‌త‌దేశంలోని రైతుల పోరాట‌ల‌ను క‌లుపుకొని భ‌విష్యత్‌లో ఉధృతం చేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.