మారని మందుబాబులు..!
– వారంలోనే వందల మందిపై కేసులు
– జరిమానాలు, జైలు శిక్షలతో జలక్
– తాండూరులో ఒకరికి జైలు, 42 మందికి జరిమానాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మద్యం సేవించి వాహనాలు నడపొద్దని పోలీసులు ఎంత అవగాహన కల్పించినా మందుబాబులు మారడం లేదు. తనిఖీలు చేస్తూ కేసులు, జరిమానాలు విధిస్తున్నారన్నా భయం లేకుండా పోయింది.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ పోలీస్టేషన్ పరిధిలో వారం రోజుల వ్యవధిలోనే వందల మందిపై కేసులు నమోదు కావడం, ఇద్దరు, ముగ్గురు జైలు పాలు కావడం చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజుల క్రితం తాండూరు పట్టణ పోలీసులు తనిఖీలు నిర్వహించి కొంత మందిపై కేసులు నమోదు చేశారు. గత గురువారం వారం వికారాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ హర్ష చౌదరి తాండూరు మండలం, పెద్దేముల్ మండలాలకు చెందిన ఇద్దరు వ్యక్తులకు మద్యం సేవిస్తూ పట్టుబడినందుకు మూడు రోజుల జైలు శిక్ష, రూ. 3వేల చొప్పున జరిమానాలు విధించారు.

అదేరోజు మద్యం సేవిస్తూ పట్టుబడిన మరో 78 మందికి రూ. 1లక్ష 14వేల జరిమానా విధించారు. తాజాగా సరిగ్గా వారం రోజులు అంటే గురువారం మందుబాబుల సీన్ రిపీట్ అయ్యింది. ఈ సారి వికారాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ హర్ష చౌదరి తాండూరు పట్టణానికి చెందిన చిలుకల రవికి 2 రోజుల జైలు శిక్షతో పాటు రూ. 3 వేల 500 జరిమాన విధించారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన మరో 42 మందికి రూ. 83 వేల జరిమాన విధించారు. ఈ విషయాన్ని తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టరిత్య చర్యలు తప్పవన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

ఇదికూడా చదవండి…

