అతలాకుతలం..!
– తాండూరులో దంచికొట్టిన వాన
– తెగిన కోకట్ కాగ్నా నది రోడ్డు
– గౌతాపూర్లో నీట మునిగిన విద్యుత్ సబ్ స్టేషన్
– సంగెంకలాన్ వాగులో కొట్టుకుపోయిన బైకులు
– బెల్కటూర్ వాగులో చిక్కుకున్న లారీ డ్రైవర్లు
– బషీరాబాద్ జీవనీలో 130 గోవుల మృత్యువాత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అంతా అతలాకుతలంగా మారిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వానలు దంచికొట్టాయి. నియోజకవర్గంలోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. వరధల ఉదృతికి రహదారులు దెబ్బతిన్నాయి. పలు గ్రామాలు జలదిగ్భందం అయ్యాయి. గ్రామాల్లో ఇండ్లలోకి వరధనీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పంటలు నీటమునగడంతో రైతులు ఆందోళనకు గురువుతున్నారు. తాండూరు పట్టణంలో పలు కాలనీలో వరధ నీరు ప్రవహించింది. మురుగు కాలువలు పొంగిపొర్లాయి. తాండూరు – కోడంగల్ రోడ్డు మార్గంలోని కాగ్నానది మళ్లీ ఉప్పొంగి ప్రవహించింది. కోకట్ సమీపంలోని కాగ్నానది రోడ్డు తెగిపోయింది. దీంతో ఈ మార్గంలోని గ్రామాలకు రాకపోకలు స్థంభించాయి.

వాగులో చిక్కుకున్న లారీ, కొట్టుకుపోయిన బైకులు
భారీ వర్షాల వల్ల తాండూరు మండలంలో వాగుల మద్య ఓలారీ చిక్కుకుపోయింది. సంగెంకలాన్ వద్ద వాగులో పలువురి బైకులు చిక్కుక్కుపోయాయి. కరణ్ కోట్ ఓగీపూర్ మార్గంలోని వాగులో ఝార్ఖండ్ నుంచి లారీ చిక్కుకుపోయింది. లారీలో ఎండీ ముజాహిద్, బుద్దీ రాం ఇద్దరు డ్రైవర్లు సిమెంట్ లొ డ్ కోసం వచ్చారు. వర్షాల వల్ల ప్రవహించిన వాగులో వారు ఇరుక్కుపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ శాఖల అధికారులు చర్యలు చేపట్టారు. తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ పరిశీలించారు.

ఎస్డీఆర్ఎఫ్ బృందంను రంగంలోకి దించి లారీ డ్రైవర్లను కాపాడారు. అదె విధంగా సంగెంకలాన్ గ్రామ సమీపంలోని వాగు వద్ద సిమెంట్ కర్మాగారాలకు వెళ్లే ఉద్యోగుల బైకులు వాగులో కొట్టుకుపోయాయి. వాగులో వరధ ఉదృతి తగ్గిన తరువాత యజమానులు వారి బైకులను తిరిగి తెచ్చుకున్నారు. గౌతాపూర్‌లో విద్యుత్ సబ్ స్టేషన్ నీట మునిగిపోయంది. దీంతో ఆయా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే
మరోవైపు తాండూరులో భారీ వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితులను వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు పరిశీలించారు. యాలాల మండలం కోకట్ కాగ్నానది పరిసర ప్రాంతాలను సందర్శించారు. వరధ ఉదృతి తగ్గుముఖం తరువాత తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడుకున్నారు.
జీవన్గీలో గోవుల మృత్యువాత
తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం జీవన్గీ గ్రామంలో దారుణం జరిగింది. గ్రామ సమీపంలోని మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ రాజకీయ నేతకు చెందిన గోశాలలో 130 గోవులు మృత్యువాత పడ్డాయి. గ్రామం మీదుగా ప్రవహిస్తున్న నది ఉదృతంగా ప్రవహించడంతో గోశాల వద్దకు పోటెత్తింది. ఈ క్రమంలో గోవులు అన్ని మృత్యువాత పడ్డాయి. ఇందులో నుంచి సుమారు 12 గోవులు ప్రాణాలతో తప్పించుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.


