రూ. 2వేల కోసం హత్య..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

రూ. 2వేల కోసం హత్య..!
– రెండేళ్ల తరువాత దొరికిన నిందితుడు
– ఆధార్‌ లేదు, సెల్ ఫోన్ వాడడు
– చివరికి పోలీసుల స్కెచ్‌కు చిక్కిన హంతకుడు
– వివరాలు వెల్లడించిన తాండూరు డీఎస్పీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : అప్పుగా తీసుకున్న 2వేలు తిరిగి ఇచ్చేయని అడిగినందుకు వ్యక్తిని కత్తితో దాడి చేసి.. అతని మృతికి కారకుడు అయ్యాడు. దాడి తరువాత పారిపోయిన నిందితుడు రెండేళ్ల పాటు పోలీసులకు చిక్కలేదు. నిందితుడికి ఆధార్ కార్డు లేకపోవడం, సెల్ ఫోన్‌ వాడే అలవాటు లేకపోవడం అతన్ని పట్టుకునేందుకు పోలీసులు ఎంతో సహనంతో వేచి చూడాల్సి వచ్చింది.

చివరకు పోలీసుల వేసిన స్కెచ్‌లో చిక్కిపోయాడు. దీంతో రెండేళ్ల క్రితం జరిగిన హత్య కేసు మిస్టరీ వీడిపోయింది. శనివారం తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి రూరల్ సీఐ నగేష్‌, పెద్దేముల్ ఎస్ఐతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా మద్నూర్ గ్రామానికి చెందిన బాలాజీ అనే వ్యక్తి రెండేళ్ల క్రితం వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం మన్‌సాన్‌ పల్లి సమీపంలోని ఓ వ్యవసాయ పొలంలో పనిచేసేందుకు వచ్చాడు.
kvcs
అప్పట్లో బాలాజీకి మన్‌సాన్‌పల్లికి చెందిన ముడావత్‌ రవితో స్నేహం ఏర్పడింది. రవి వద్ద బాలాజీ అప్పుడప్పుడు డబ్బులు అప్పుగా తీసుకునే వాడు. రవి ఇచ్చిన అప్పులు రూ. 2వేల 50ల వరకు అయ్యాయి. తీసుకున్న డబ్బులు ఇవ్వాలని రవి బాలాజీని కోరేవాడు. బాలాజీ ఇవ్వకుండా తప్పించుకునే వాడు. రవి సహనం కోల్పోయి గ్రామస్తుల ముందు బాలాజీ తిట్టేశాడు. దీంతో కక్ష్య పెంచుకున్న బాలాజీ 2023 ఆగస్టు 12వ తేదిన రవిపై కత్తితో దాడిచేశాడు. దాడిలో గాయపడిన రవిని కుటుంభీకులు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అదెనెల 18వ తేదిన రవి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పటికే బాలాజీ పరారయ్యాడు.

ఎలా చిక్కాడంటే..?
మృతుడు రవి సోదరునికి ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే నిందితుడు ఇక్కడి వాడు కాకపోవడంతో తప్పించుకుని తిరిగేవాడు. పోలీసులు నిందితుని స్వగ్రామంలో విచారించగా బాలాజీకి ఆధార్ కార్డు లేదని, బ్యాంకు ఖాతా లేదని, సెల్ ఫోన్‌ కూడా వాడడని గుర్తించారు.

దీంతో పోలీసులు కుటుంబ సభ్యుల మీద నిఘా ఉంచారు, కొన్నాళ్ల క్రితం తల్లి చనిపోయినా కూడా బాలాజీ గ్రామానికి రాలేదు. అతని భార్య, పిల్లలు కూడా వదిలేసి వెళ్లిపోయారు. దీంతో రెండేళ్లుగా పోలీసులు నిందితుడిపై నిఘా ఉంచారు. ఇటీవలే సంగారెడ్డిలో ఉన్న సోదరుని ఇంటికి బాలాజీ వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. శనివారం నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో నిందితుడు నేరం అంగీకరించారు. ఈ మేరకు అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు, హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. నిందితున్ని రిమాండుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. కేసు చేధించిన పోలీసు సిబ్బంది అంజద్, శివ, మున్నయ్యలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా.. పరిచయం లేని వ్యక్తులు తమ వద్ద పనిచేసేందుకు వస్తే వారి పూర్తి వివరాలను తీసుకుని పనిలో పెట్టుకోవాలని సూచించారు.

ఇదికూడా చదవండి….

రిజర్వేషన్లు బీసీల హక్కు..!