రిగ్గింగ్.. నిగ్గు తేల్చండి..!
– రూలింగ్ అండతో ఆర్వో అక్రమాలు
– ఫలితాల తారుమారుతో అన్యాయం
– రికౌంటింగ్ చేయించి న్యాయం చేయండి
– గాజీపూజ్ బీఆర్ఎస్ మద్దతు దారుల డిమాండ్
– జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలలో రిగ్గింగ్ చేశారని, ఇందులో ఆర్వో అక్రమాలకు పాల్పడినట్లు కలిగిన అనునాలపై విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ బలబరిచిన గ్రామ పంచాయతీ సర్పంచు అభ్యర్థి తలారీ సుశీల భర్త తలరీ వీరప్ప డిమాండ్ చేశారు.

బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తలారీ వీరప్ప గ్రామస్తులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈనెల 11న గాజీపూర్ గ్రామంలో సర్పంచ్ పదవితో పాటు వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయని చెప్పుకొచ్చారు. ఎన్నికల కౌంటింగ్ తరువాత బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సుశీల 53 ఓట్ల తేడాతో ఓటమి చెందారని ఆర్వో ప్రకటించారని తెలిపారు. గ్రామంలో 10 వార్డులకు గాను 7 మంది బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన వార్డు సభ్యులు 326 ఓట్ల మెజార్టీలతో విజయం సాధించారని తెలిపారు. మిగతా మూడు వార్డు సభ్యులకు 49 ఓట్లు మెజార్టీ వచ్చాయని వెల్లడించారు.

ఆ లెక్కన బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన సుశీల విజయం సాధించాలని, ఇందులో ఆర్వో అక్రమాలకు పాల్పడినట్లు అనుమానం కలిగిందని చెప్పారు. రూలింగ్ పార్టీ నాయకుల ఒత్తిళ్లతో ఆర్పో ఫలితాలను తారుమారు చేశారని ఆరోపించారు. ఇదే విషయంపై ఆర్వోను నిలదీస్తే ఉన్నతాధికారులు రీకౌంటింగ్ చేయవద్దని చెప్పి తప్పించుకున్నారని అన్నారు. మరుసటి రోజు ఆర్వో అందించిన కౌంటింగ్ వివరాలలో ఒక్క బ్యాలెట్ పేపర్ తేడా వచ్చిందని తెలిపారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు దారురాలైన సుశీల గెలవకుండా ఆర్వో అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో రిగ్గింగ్‌కు యత్నించారని అన్నారు. రిగ్గింగ్ యత్నంలో నిజాలను నిగ్గుతేల్చేందుకు ఆర్వోపై విచారణ చేయించాలని, అప్పటి వరకు సర్పంచ్ ప్రమాణ స్వీకారం వాయిదా వేయాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాలను రీకౌంటింగ్ చేయించి.. న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

ఇదికూడా చదవండి…

