బల్దియా రేసులోకి రవీందర్ గౌడ్..?
– చైర్మన్ బరిలో నిలిచేందుకు ఫోకస్
– చిరకాల కోరిక నెరవేర్చుకునేందుకు యత్నం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికల రేసులోకి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ తాజా మాజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ వస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన రంగంలోకి దిగుతుండడం చర్చనీయాంశంగా మారింది.

ఒక విధంగా రవీందర్ గౌడ్ రాజకీయ ప్రస్తానం మున్సిపల్ ఎన్నికల నుంచే మొదలైందని చెప్పవచ్చు. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి అప్పట్లో 4వ వార్డుగా ఉన్న ఇందిరానగర్ హమాలిబస్తీ నుంచి రవీందర్ గౌడ్ కౌన్సిలర్ గా పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత తాండూరు జెడ్పీటీసీగా పనిచేశారు. అనంతరం ఎల్మకన్నె సహాకార సంఘం చైర్మన్ గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం ఆయన డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ గా పనిచేశారు.

ఇటీవల డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ పదవి కాలం ముగిసింది. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో రవీందర్ గౌడ్ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వార్డుల రిజర్వేషన్ల ప్రకటన తరువాత పట్టణంలోని 24వ వార్డు నుంచి పోటీచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. పార్టీ పెద్దల సహాకారంతో చైర్మన్ గా నిలవాలని భావిస్తున్నారు. రవీందర్ గౌడ్ కౌన్సిలర్ గా పనిచేసిన తరువాత మున్సిపల్ చైర్మన్ కావాలని కలలు కన్నారు. తాజాగా ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో నిలిచి చైర్మన్ అయి తన చిరకాల కోరికను నెరవేర్చుకోవాలని దృష్టిసారించారు.

ఇదికూడా చదవండి…

