ప్రభుత్వానికి పొర్లుదండాలు..!
– రోడ్ల బాగుకోసం టీఆర్ఎస్ కార్యకర్త నిరసన
– కాలుష్యాన్ని నియంత్రించాలని విజ్ఞప్తి
– అడ్డుకుని అదుపులోకి తీసుకున్న పోలీసులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: రోడ్లు బాగు చేయాలని.. కాలుష్యాన్ని నియంత్రించాలని అధికార టీఆర్ఎస్‌కు చెందిన ఓ సామాన్య కార్యకర్త ప్రభుత్వానికి పొర్లుదండాలు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని అంతారం గ్రామ శివారు వద్ద చోటు చేసుకుంది. మొన్నటి మొన్న అదే అంతారం గ్రామానికి చెందిన రిజ్వాన్ అనే వ్యక్తి తాండూరు అభివృద్ధి దిగజారిపోవడానికి కారణం నేనే అంటూ మెడలో చెప్పుల దండ వేసుకుని.. చెత్త ఓటర్‌ను నేను.. నన్ను చెప్పుతో కొట్టండి అంటూ నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా అంతారం అనుబంధ గ్రామం దస్తగిరిపేట్ గ్రామానికి చెందిన బొయిని అంబ్రేష్ ముదిరాజ్ అనే టీఆర్ఎస్ కార్యకర్త నిరసనకు దిగాడు. అంతారం నుంచి పొర్లుదండాలు పెడుతూ ముందుకు సాగాడు. ముందు మొకాళ్లపై నడిచి.. కొద్ది దూరం తరువాత కంకర రోడ్డుపైనే పొర్లుతూ మార్గమద్యలోని టీఆర్సీ క్లబ్ వద్దకు చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కార్యకర్త అంబ్రేష్‌ను అడ్డుకున్నారు. అతన్ని పోలీస్టేషన్‌కు తరలించారు.
అయితే తాండూరులో రోడ్లు అధ్వాన్నంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి రోడ్లు బాగుచేయాలనే ఉద్దేశంతో నిరసన చేపట్టినట్లు అంబ్రేష్ తెలిపారు. దీంతో పాటు పట్టణంలో విపరీతంగా పెరిగిన కాలుష్యంపై పట్టించుకోవడంలేదని, కాలుష్యాన్ని నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి పొర్లుదండాలు పెట్టినట్లు చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా తాండూరులో తిష్టవేసిన సమస్యలను పరిష్కరించాలని సామన్యులు నిరసనకు దిగడం చర్చనీయాశంగా మారుతున్నాయి.
