ఎంసీహెచ్ ఆసుపత్రి మెరుగుపై దృష్టి..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

ఎంసీహెచ్ ఆసుపత్రి మెరుగుపై దృష్టి..!
– లీకేజీలకు మరమ్మత్తుల చికిత్స
– మరుగుదొడ్లు, డ్రైనేజీ మౌళిక సదుపాయాల కల్పన
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– ఆసుపత్రిలో మందుల కొరత లేదు : జిల్లా కలెక్టర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : శిథిలావస్థకు చేరుకున్న తాండూరు మాతా శిశు ఆసుపత్రిని మెరుగు పరిచేందుకు దృష్టిసారించడం జరుగుతుందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

శుక్రవారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రిని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ ప్రతీక్‌ జైన్‌తో కలిసి సందర్శించారు. ఆసుపత్రిలో చిన్నారులకు, మహిళలకు, గర్భిణీ, బాలింతలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఆసుపత్రిలో అందిస్తున్న సేవలపై రోగులను, బందువులను అడిగి తెలుసుకున్నారు. ప్రసవ సేవల్లో ఇబ్బందులు ఆరా తీశారు. పలు వార్డుల్లో లీకేజీల సమస్యల ఉన్నాయని దృష్టికి రావడంతో ఆయా వార్డులలో పర్యటించి పరిశీలించారు.

అదేవిధంగా మరుగుదొడ్లు, డ్రైనేజీల సమస్య ఉందని తెలుసుకుని పరిష్కారానికి తీసుకోబోయే చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ శిథిలావస్థకు చేరుకున్న ఆసుపత్రి మెరుగు కోసం దృష్టి సారించడం జరుగుతుందని అన్నారు. లీకేజీలను మరమ్మత్తులు చేయించడంతో పాటు మరుగుదొడ్లు, డ్రైనేజీలు, మౌళిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్దం చేయడం జరుగుతుందన్నారు. ఆసుపత్రిని మెరుగు పరిచి రోగులకు, బందువులకు భద్రత కల్పించడం జరుగుతుందన్నారు.

మరోవైపు ఆసుపత్రి నిర్మించి 5ఏండ్లు మాత్రమే కావస్తుందని.. శిథిలావస్థతకు చేరుకోవడం పట్ల కాంట్రాక్టర్‌పై చర్యలు ఉంటాయా అని కలెక్టర్‌ను కోరగా నిబంధనలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రిలో మందుల కొరత లేదని, పైనుంచి రావాల్సిన వాటిని వెంటనే విడుదల చేయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, డీసీహెచ్‌ఎస్ డా. ఆనంద్, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వినయ్ కుమార్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, నాయకులు బంటు మల్లప్ప, జుబేర్ లాల, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

రెండు నెలల్లో.. రెండు గదుల ఇళ్లు..!