పరిశుభ్రతకు ప్రాధాన్యం..!
– బాధ్యతగా మొక్కల సంరక్షణ
– మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి
– పట్టణంలో హోటల్స్‌లో తనిఖీలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు ప్రాధాన్యం ఇవ్వాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు.

ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమం బుధవారం కొనసాగింది. ఇందులో భాగంగా చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమీషనర్ మధుసూదన్ రెడ్డిలు పట్టణంలో పర్యటించారు. పాత మున్సిపల్ కార్యాలయం, జిల్లా ఆసుపత్రి పరిసర ప్రాంతాలు, రైల్వే స్టేషన్ రోడ్డు, డీఎస్పీ కార్యాలయం తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఆయా ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మున్సిపల్ నుంచి ప్రతి రోజూ పారిశుద్ధ్య పనులు చేపట్టేలా చూడాలని కమీషనర్‌కు సూచించారు.

అనంతరం రైల్వే స్టేషన్ మార్గంలో ఉన్న హోటల్స్‌ను తనిఖీ చేశారు. వంట గదులను పరిశీలించారు. నిర్వహకులు ప్రజలకు నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. కల్తీ ఆహారాలను అందిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా తాండూరు పట్టణం గొల్ల చెరువు మిని ట్యాంక్ బండ్‌ను చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి సందర్శించారు. అమృత్ 2.0 కింద నాటిన మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. మొక్కలను బాధ్యతగా సంరక్షించాలని పర్యవేక్షలను ఆదేశించారు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ పట్టణంలో పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికకు అందరు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాగారం మల్లేశం, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, టీపీబీఓలు, ఎన్వీరాల్ మెంట్ ఇంజనీర్, మెప్మా అధికారులు, శానిటరీ ఇనుస్పెక్టర్లు, వార్డు ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.


