రోడ్ల అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి
– పెండింగ్ పనుల పూర్తికి చర్యలు
– పాత తాండూరు వంతెనకు రూ. 73 కోట్లు
– సీసీ రోడ్డు పనులకు రూ. 5.30 కోట్లు
– కోడంగల్.. కొత్లాపూర్ రోడ్డు మరమ్మత్తుకు రూ. 21 కోట్లు
– తాండూరు పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు అఫ్పూ(నయూం)
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ప్రాంతంలో రోడ్ల అభివృద్దికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ తాండూరులో ఆగిపోయిన రోడ్డు అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారని అన్నారు. ఎప్పటికప్పుడు సంబంధిత కాంట్రాక్టర్లు, ఆర్అండ్‌బి అధికారులతో మాట్లాడి రోడ్డు పనుల వేగవంతానికి ప్రయత్నిస్తున్నారన్నారు. వచ్చే ఆరు మాసాల వ్యవధిలో అన్ని రోడ్లను అభివృద్ధి పరిచేందుకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రణాళిక బద్దంగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా
తాండూరులోని పాత తాండూరు మార్గంలో రైల్వే ట్రాక్‌పై వంతెన నిర్మాణానికి రూ. 73 కోట్లు మంజూరు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇదే విషయంపై ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి నిధుల విడుదలకు విజ్ఞప్తి చేశారని గుర్తుచేశారు. తాండూరులోని ఇందిరా చౌక్‌నుంచి సెయింట్ మార్క్స్ పాఠశాల వరకు రెండు వైపులా సీసీ రోడ్డు నిర్మాణానికి రూ. 5.30 కోట్లు మంజూరు చేయించారని వెల్లడించారు. అతిత్వరలో ఈ పనులకు టెండర్లు పిలువ బోతున్నారని స్పష్టం చేశారు. కోడంగల్ నుంచి సరిహద్దులో ఉన్న కొత్లాపూర్ వరకు ఉన్న ప్రధాన రహదారి మరమ్మత్తులకు కేంద్రంలోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి రూ. 21 కోట్లు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మంజూరు చేయించారని… ఈ మరమ్మత్తు పనులు వచ్చే ఆరు నెలల్లో పూర్తి అవుతాయన్నారు. తాండూరు ప్రాంతంలోని దీర్ఘకాలంగా పాడైన అన్ని రోడ్లను అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తాండూరు నియోజకవర్గ అభవృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు.

