సూపర్ పోలీస్..!
– 4 గంటల్లోనే చైన్ స్నాచింగ్ కేసు సాల్వ్
– అభినందించిన జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా
– నిందితులను ఎలా పట్టుకున్నారంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రాంతంలో హడలెత్తించిన గొలుసు దొంగలను కేవలం నాలుగు గంటల్లోనే పట్టుకున్న పోలీసులు సూపర్.. హాట్సాఫ్ అనిపించుకున్నారు.

వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా కేసును చేధించిన పోలీసులను అభినందించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కోకట్ రోడ్డు మార్గంలో ఇంటి బయట పనిచేసుకుంటున్న శ్యామలమ్మ అనే మహిళ మెడలో బంగారు ఆబరణం ఎత్తుకెళ్లడంతో పాటు ఆదర్శనగర్‌లో విధులకు వెళుతున్న మహిళ మెడలో బంగారం లాక్కునే యత్నం చేశారు.

ఈ సంఘటన తాండూరులో కలవరం రేపింది. బాధితుల ద్వారా సమాచారం అందుకున్న యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి తన సిబ్బందితో రంగంలోకి దిగారు. దొంగలు తిరిగిన ప్రాంతాలలో సీసీ పుటేజీలను పరిశీలించారు. నిందితులు తమ పనులు ముగించుకుని ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లు సమాచారం అందుకున్నారు. వెంటనే ఆయా మార్గంలో ఉన్న పోలీసులను అప్రమత్తం చేసి నిందితులను పట్టుకున్నట్లు తెలిసింది. కేవలం 4 గంటల్లోనే చోరీలకు పాల్పడిన నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి, పోలీసులను అభినందించారు. అదేవిధంగా ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, జరిగిన ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా అందించారు.


