ఉత్తమ, ఉద్యమ ఉపాధ్యాయుడు దూస ఇకలేరు
– గుండెపోటుతో టీచర్ శ్రీనివాస్ కన్నుమూత
– ఎక్కడ పనిచేసినా విద్యాభివృద్ధికి ఎంతో కృషి
– ఆయన మృతిపట్ల ఉపాధ్యాయ సంఘాల దిగ్బ్రాంతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు.. ఉద్యమ ఉపాధ్యాయుడు దూస శ్రీనివాస్ ఇకలేరు. శుక్రవారం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడియారు.

ఆయన మరణంతో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. తాండూరు పట్టణం చెందిన దూస శ్రీనివాస్, ఆయన సతీమణి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. శ్రీనివాస్ పెద్దేముల్ మండలం ఇందూరు జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో పనిచేస్తుండగా ఆయన సతీమణి అదే మండలం మారేపల్లిలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. అయితే శుక్రవారం ఉదయం ఇంట్లో ఉన్న కారును శుభ్రం చేసి విధులకు సిద్దమవుతున్నారు. అదే సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. గమనించిన కుటుంభీకులు ఆసుపత్రికి తరలించారు.

అప్పటికే శ్రీనివాస్ గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. దూస శ్రీనివాస్ బాలకార్మికుల నిర్మూలనకు ఎంవీ ఫౌండేషన్ ద్వారా ప్రజలను చైతన్య పరిచారు. పల్లెబాట కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ వేషాధారణలో ఆకట్టుకున్నారు. శ్రీనివాస్ ఏ పాఠశాలలో విధులు నిర్వహించినా తన సొంత నిధులతో కూడా స్కూల్లో మౌళిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేశారు. ఎంతో మంది పేద విద్యార్థులకు ఆర్థిక చేయూతను అందించి ఆదుకున్నారు. దీంతోపాటు యూటీఎఫ్ ఉపాధ్యాయు సంఘంలో జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నారు. శ్రీనివాస్ హఠాన్మరణంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. శ్రీనివాస్ మృతిపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు విచారం వ్యక్తం చేస్తున్నారు.


