ఒంటరై పోయిన కార్తిక్..!
– ఆలన పాలనకు దిక్కెవరు
– ఆర్థిక చేయూతకు ఎదురుచూపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రోడ్డు ప్రమాదంలో అమ్మానాన్నలతో పాటు చెల్లిని కోల్పోయిన బాలుడు ఒంటరిగా మిగిలిపోయాడు. అభం.. శుభం.. తెలియని చిన్నారి మళ్లీ అమ్మనాన్నలు ఎప్పుడొస్తారు..? చెల్లిని ఎప్పుడు చూడాలని బందువులను బేలగా అడుగుతుంటే గుండె తరుక్కుపోతోంది.

అమ్మనాన్నలను కోల్పోయిన ఆ బాలుడి ఆలన పాలనకు దిక్కెవరు అంటూ విచారం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం పెద్దేముల్ మండలం తట్టెపల్లి సమీపంలో అత్తగారింటి నుంచి సొంతింటికి వెళుతున్న జహీరాబాద్‌కు చెందిన కవిరాజ్, పావని, కీర్తనలు స్కూటీని లారీ ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా కుమారుడు కార్తిక్ ఒక్కడే గాయాలతో బయటపడిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో గాయపడిన కార్తిక్‌ను కుటుంబీకులు హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కార్తిక్ క్షేమంగా ఉన్నాడు.

అయితే కార్తిక్ అమ్మనాన్నలు, చెల్లి లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. మళ్లీ వాళ్లు ఎప్పుడొస్తారంటూ వెంట వెళ్లిన నాన్నమ్మను అడుగుతున్నాడు. చిన్నారి గుండెలో ఉన్న బాధ ఓ ఎత్తు అయితే.. ఇకపై కార్తీక్ భవిష్యత్తు ఎలా అంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. బాలుడి చదువుకు, భవిష్యత్తుకు ఆర్థిక చేయూత ఎంతో అవసరం. ఎవరైనా దాతలు, మానవతా వాదులు స్పందించి కార్తిక్ కుటుంబానికి చేయూత అందించాలని ఆప్తులు కోరుతున్నారు. వివరాలకు సెల్ : 6281533328కు సంప్రదించాలని కోరారు.


