దూది మరిచి.. కుట్లు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

దూది మరిచి.. కుట్లు..!
– అనారోగ్యానికి గురై తల్లడిల్లిన తల్లి
– మళ్లీ ఆసుపత్రికి వస్తే నయం అవుతుందని నమ్మించిన వైద్యలు
– పరిస్థితి విషమించడంలో చేతులేత్తేసిన వైనం
– తాండూరు మాతా శిశు ఆసుపత్రి వైద్యుల నిర్వాకం
– చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యుల డిమాండ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాన్పుకోసం వచ్చిన ఓ మహిళకు ప్రసవం తరువాత దూదిని మరిచి వైద్యులు అలాగే కుట్లు వేశారు. రోజుల వ్యవధిలోనే అనారోగ్యానికి గురైన తల్లి తల్లడిల్లి పోయింది.

వేరే ఆసుపత్రిలో చూపించగా కడుపులో పెట్టి మరిచిపోయిన దూది కనిపించింది. అనంతరం చికిత్స పొందిన ఆసుపత్రికి వెళ్లి అడిగితే త్వరలోనే నయమవుతుందని వైద్యులు కుటుంభీకులు నమ్మించారు. తాజాగా తల్లి పరిస్థితి విషమించడంతో వైద్యులు చేతులెత్తేశారు. తాండూరు పట్టణం హైదరాబాద్‌ రోడ్డు మార్గంలో ఉన్న మాతా శిశు ఆసుపత్రిలో వైద్యులు చేసిన నిర్వాకం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ కి చెందిన ఆర్తి కాన్పు నిమిత్తం ఈనెల 3వ తేదీన తాండూరు పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రిలో చేరింది.

ఆరోజే సాధారణ కాన్పు జరగడంతో శిశువుకు జన్మనిచ్చింది. కాన్పు సమయంలో ఎపిసియోటమి చేసిన వైద్యులు ఆర్తికి కుట్లు వేయాలని చెప్పి.. చికిత్స తరువాత దూదిని లోపల మర్చిపోయారు. అలాగే కుట్లు వేసి వార్డుకు తరలించారు. 5రోజుల తరువాత ఆర్తిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. ఆర్తి ఆసుపత్రి నుంచి తన తల్లిగారి ఊరైన కర్ణాటకకు వెళ్లింది. ఆ తరువాత ఆర్తి తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రిలో చూపించారు. అక్కడ ఆర్తికి కుట్లు విప్పి లోపల ఉన్న కాటన్ ఉన్నట్లు గుర్తించి బయటకు తీశారు.

దీంతో తిరిగి కుటుంబ సభ్యులు ఆర్తిని తీసుకొని గురువారం మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి వచ్చారు. అయితే వైద్యులు ఆర్తికి రెండు రోజుల్లో నయమవుతుందని నమ్మించారు. క్రమంగా ఆర్తి పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన వైద్యం నిమిత్తం ఆమెను హైదరాబాద్ కు తరలించాలని వైద్యులు చేతులెత్తేశారు. ఆర్తి భర్త మాట్లాడుతూ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన భార్య పరిస్థితి విషమంగా మారిందని, సంబంధిత వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కుటుంభీకులు ఆర్తిని హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటనపై మాతా శిశు ఆసుపత్రి ఆర్ఎంఓ డా.అనిల్‌ను వివరణ కోరగా కడుపులో దూది మరచి కుట్లువేసింది వాస్తవమేనని, నిర్లక్ష్యంగా వ్యవహించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మాతా శిశు ఆసుపత్రికి ఇదేం దుర్గతి..?