ఎంసీహెచ్ ఘటనపై సీరీయస్
– ఆసుపత్రిని సందర్శించిన అడిషనల్ కలెక్టర్
– వైద్య సేవల్లో నిర్లక్ష్యం చేయరాదంటూ హెచ్చరిక
– నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు
– వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రిలో జరిగిన ఘటనపై జిల్లా అధికారులు సీరీయస్ అయినట్లు తెలిసింది.

శనివారం మాతా శిశు ఆసుపత్రిని అడిషనల్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ సందర్శించారు. ఆసుపత్రిలో వెలుగులోకి వచ్చిన బాలింత ఆర్తికి ప్రసవ సమయంలో దూది పెట్టి కుట్లు వేసిన నిర్లక్ష్య ఘటనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం, పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

గర్భిణీలు, బాలింతలు,చిన్నారులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా డాక్టర్ లు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వైద్యులు, సిబ్బంది సమయపాలనతో విధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శరత్, ఆర్ఎంఓ డా. అనిల్, సునీత, మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, వైద్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


