విద్యావేత్తలపై దాడులు దుర్మార్గం

తాండూరు రాజకీయం వికారాబాద్

విద్యావేత్తలపై దాడులు దుర్మార్గం
– రూపారెడ్డి హత్యోదంతాలు పునరావృత్తం కావద్దు
– నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి
– తాండూరులో టీపీటీఎఎఫ్‌, అసోసియేషన్ల నిరసన
తాండూర్, దర్శిని ప్రతినిధి : విద్యావేత్తలు, ఉపాధ్యాయులపై దాడులు జరగడం దుర్మార్గమని తాండూరుకు చెందిన పలువురు నేతలు, విద్యావేత్తలు అన్నారు.

నల్గొండ జిల్లాలో ఇటీవల జరిగిన ప్రిన్సిపాల్‌ రూపారెడ్డి దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తూ శుక్రవారం తెలంగాణ ప్రైవేట్‌ టీచర్స్‌ ఫోరం (టీపిటీఎఫ్‌) వికారాబాద్‌ జిల్లా, తాండూర్‌ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ కూడలిలో సంతాప సభ నిర్వహించారు. రూపారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

నేతలు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రూపారెడ్డి హత్య దారుణమని అన్నారు. ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, విద్యాసంస్థల సిబ్బందికి ప్రభుత్వం పూర్తి భద్రత కల్పించాలని, నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యాసంస్థల్లో భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని కోరారు.

అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్‌, గంజాయి, మొబైల్‌ ఫోన్ల దుర్వినియోగం, సోషల్‌ మీడియా దుష్ప్రభావాలపై పాఠశాలల్లో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో టీపిటీఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షులు కందుకూరి రాజ్‌కుమార్‌, టీజేఎస్‌ రాష్ట్ర నాయకులు సోమశంకర్‌, విద్యావంతుల వేదిక నాయకులు పర్యాద రామకృష్ణ, టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యాక్షులు మమహ్మద్ అఖీల్, ట్రస్ట్మా తాండూరు గౌరవాధ్యక్షులు కీర్తి శర్మ, అధ్యక్షులు మోహన్‌ కృష్ణ గౌడ్‌, సెక్రటరీ వెంకటేష్‌, సీపీఐ జిల్లా నాయకులు శ్రీనివాస్‌, పిడీఎస్యూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్‌, ఏ.ఆర్‌. లాజిక్స్‌ అశోక్‌, స్వరోజ్‌ నాయకులు శివకుమార్‌, విద్యాసంస్థల యజమానులు, పలువురు ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు.

రోడ్లపై ఆక్రమణల తొలగింపు..!