రోడ్లపై ఆక్రమణల తొలగింపు..!
– వ్యతిరేకించిన చిరు వ్యాపారులు
– మున్సిపల్ సిబ్బందితో వాగ్వివాదం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని రోడ్లపై ఆక్రమణల తొలగింపు వివాదాస్పదంగా మారింది. పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం ముందు భాగంలో ఉన్న చిరు వ్యాపారులు వేసుకున్న ఆక్రమణలను శుక్రవారం మున్సిపల్ సిబ్బంది తొలగించారు.

ఇందుకు వ్యాపారులు వ్యతిరేకిస్తూ మున్సిపల్ నిర్ణయంపై మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులు వ్యాపారులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఇదే రోడ్డు మార్గంలో ఎన్నో ఆక్రమణలు ఉన్నా.. చిరు వ్యాపారులపైనే ఎందుకు ప్రతాపం చూపిస్తున్నారని నిలదీశారు. విషయం పెద్దది కావడంతో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, వ్యాపారుల మద్య ఘర్షణ లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఆక్రమణలు తొలగించాలని గతంలోనే సూచించినా చిరు వ్యాపారులు పట్టించుకోలేదని మున్సిపల్ సిబ్బంది తెలిపారు. ఎవ్వరు పట్టించుకోకపొవడంతో ఆక్రమణలు తొలగింపు చేసినట్లు తెలిపారు.

దీనిపై వ్యాపారులు మున్సిపల్ చైర్ పర్సన్, కమీషనర్‌ను కలిసేందుకు కార్యాలయానికి తరలివెళ్లారు. దీనిపై చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, కమీషనర్‌లు మాట్లాడుతూ రోడ్లను ఆక్రమించకుండా వ్యాపారాలు చేసుకోవాలని, ఇంకా ఇబ్బందులు ఉంటే ప్రత్యామ్నాయ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.


