అక్రమ రవాణాలపై ప్రత్యేక దృష్టి
– నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు
– పోలీస్టేషన్ల వారిగా సమస్యల పరిష్కారానికి కృషి
– వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎస్. కోటి రెడ్డి
– తాండూరు సబ్ డివిజన్లో పోలీస్టేషన్ల పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : జిల్లాలో అక్రమ రవాణా, అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం తాండూరు డీఎస్పీ కార్యాలయం, పట్టణ పోలీస్టేషన్, రూరల్ పరిధిలోని పలు పోలీస్టేషన్లను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి సందర్శించారు. తాండూరు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్సీ లక్ష్మీనారాయణతో కలిసి పలు కేసుల వివరాలు, శాంతి భద్రతల విషయాలపై ఆరా తీశారు. అనంతరం పట్టణ పోలీస్టేషన్, రూరల్ పోలీస్టేషన్లలో సీఐలు రాజేందర్ రెడ్డి, జలంధర్ రెడ్డిలు, ఎస్ఐలతో కలిసి పోలీస్టేషన్లలో కేసులు నమోదు, పెండింగ్ కేసుల పరిష్కార విషయాలపై అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చే పట్టిన తరువాత పోలీస్టేషన్లను సందర్శించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా తాండూరు డీఎస్సీ, పోలీస్టేషన్లను సందర్శించడం జరిగిందన్నారు. జిల్లాలో శాంతిభద్రతల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. గత రెండు మూడేళ్లుగా జిల్లాలో ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నమోదయ్యాయని అన్నారు. దీంతో పాటు అక్రమ ఇసుక రవాణా, నల్లబెల్లం, రేషన్ బియ్యం రవాణాపై దృష్టిసారిండం జరుగుతుందన్నారు. ఎన్ఫోర్స్ మెంట్ విభాగాన్ని కూడ మరింత మెరుగు పరిచేలా చూస్తామన్నారు. త్వరలోనే అక్రమ రవాణా, ఇల్లీగల్ కార్యక్రమాలపై నిఘా ఉంచి నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా పోలీస్టేషన్లల వారిగా పోలీసు అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పోలీస్టేషన్ల ఎస్ఐలు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

