దివ్యాంగుల‌కు అందొచ్చిన మంచ్ సేవ‌లు

తాండూరు వికారాబాద్

దివ్యాంగుల‌కు అందొచ్చిన మంచ్ సేవ‌లు
– జైపూర్ కాళ్లు, కృతిమ అవ‌య‌వాల పంపిణీ అభినంద‌నీయం
– వికారాబాద్ జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్నం సునితా మ‌హేంద‌ర్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ప్ర‌మాదంలో కాళ్లు, చేతులు కోల్పోయిన వారితో పాటు పోలియో గ్ర‌స్తుల విక‌లాంగుల‌కు మార్వాడి యువ‌మంచ్ వారికి అందివ‌చ్చే సేవ‌ల‌ను అందించ‌డం అభినంద‌నీమ‌ని వికారాబాద్ జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్నం సునితా మ‌హేందర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు ప‌ట్ట‌ణంలోని బాలాజీ మందిర్‌లో మార్వాడి యువ‌మంచ్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న విక‌లాంగుల సేవా శిబిరాన్ని వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునితా మహేందర్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ గుప్తతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సునితారెడ్డి వివిధ ప్రాంతాల నుంచి శిబిరానికి వచ్చిన వికలాంగులను పలకరించారు.
మంచ్ ఆధ్వర్యంలో అందించిన జైపూర్ కాళ్లు, కాలిఫర్స్ పరికరాలు, కృతిమ అవయవాల అమరికపై స్పందనను అడిగితెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వికలాంగుల కోసం ప్రతి రెండేళ్లకోసారి మార్వాడి యువమంచ్ చేపట్టే సేవా కార్యక్రమాలు అజరామంగా నిలుస్తాయన్నారు. వికలాంగుల నడకకు మంచ్ సేవలు వరంలా మారాయని పేర్కొన్నారు. ఆమె వెంట డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, టీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, ఫ్లోర్ లీడర్ శోభారాణి, సీనియర్ కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, అబ్దుల్ రజాక్, నాయకులు మసూద్ తదితరులు ఉన్నారు. మరోవైపు ఈ శిబిరాన్ని తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్, డీఆర్డీఏ ఏపీఓ శ్రీలక్ష్మీలు సందర్శించి పరిశీలించారు.
ఈ సంద‌ర్బంగా మంచ్ స‌భ్యులు జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ సునితారెడ్డి, చైర్ పర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్‌, ఆర్డీఓ అశోక్ కుమార్ త‌దిత‌రులను స‌న్మానించారు.

103 మందికి పరికరాల అందజేత
మార్వాడి యువమంచ్ శిబిరంలో గురువారం 103 మందికి ఉచితంగా జైపూర్ కాళ్లు, కాలిఫర్స్, కృతిమ అవయవాలను మంచ్ సభ్యులు పంపిణీ చేశారు. ఈ శిబిరానికి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి దాదాపు 210 మంది పేర్లను నమోదు చేసుకున్నారని సభ్యులు తెలిపారు. వీరికి మొదటి రోజు 103 మందికి జైపూర్ కాళ్లు, చేతులు, కాలిఫర్ను అందజేయడం జరిగిందని వెల్లడించారు. శుక్రవారం మిగతా వారికి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్వాడి యువమంచ్ జాతీయ సభ్యులు మన్మోహన్ సార్తా, కన్వినర్ కుంజ్ బిహారి సోని, రాష్ట్ర కన్వినర్ అనిల్ సార్తా, క్యాంపు చైర్మన్ సునిల్ సార్తా. తాండూరు అధ్యక్షులు సన్ని అగ్రవాల్, కోశాధికారి కిషన్ రాఠి, దీపక్ గగ్రా, కరణ్ జైన్, మధు పసారి తదితరులు పాల్గొన్నారు.