మాజీ కౌన్సిలర్ కమలమ్మ కన్నుమూత
– టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శోభారాణి నివాసంలో విషాధం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ టీఆర్ఎస్ ఫ్లోరీడర్ శోభారాణి తల్లీ, మాజీ కౌన్సిలర్ జుంటుపల్లి కమలమ్మ (88) కన్నుమూశారు. గత యేడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇంటికే పరిమితమయ్యారు. శనివారం సాయంత్రం కమలమ్మ తుదిశ్వాస విడిచారు. కమలమ్మ నాగారం నర్సింలు చైర్మన్ హయాంలో తెలుగు దేశం పార్టీ నుంచి కౌన్సిలర్‌గా పనిచేశారు. అప్పట్లో పాత తాండూరులోని వార్డులో కౌన్సిలర్‌గా ప్రజలకు సేవలందించారు. ఆమె మరణంతో శోభారాణి నివాసంలో విషాదం నెలకొంది. కమలమ్మ మరణం విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు రేపు ఆదివారం పాతతాండూరులో కమలమ్మ అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబీకులు తెలిపారు.
కమలమ్మ రాజకీయ ప్రస్థానం
తాండూరు నియోజకవర్గంలో కమలమ్మ మొదట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 1983లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పట్లో పాత తాండూరులో రెండే వార్డులో ఉండగా తెలుగు దేశం పార్టీ నుంచి ధీటైన పోటీని ఇచ్చి గెలుపొందారు. 1990-95 మద్య కాలంలో భద్రేశ్వర దేవాలయం, కాళికాదేవి ఆలయాల కమిటీల సభ్యురాలుగా కొనసాగారు. 1995 నుంచి 2005 వరకు బీజేపీ మున్సిపల్ పాలనలో కౌన్సిలర్‌గా పనిచేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షురాలుగా కూడ పనిచేశారు. అనంతరం ఆమె మార్గదర్శకంలోనే ప్రస్తుత టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శోభారాణి రాజకీయ నాయకురాలుగా ఎదిగారు.

