మాయమాటలతో వల..!
– మైనర్ బాలికపై అఘాయిత్యం
– కేసు నమోదైందని వదిలి పరార్
– రిమాండ్‌కు తరలించిన పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఐటీఐ చదువుతున్న ఓ యువకుడు మైనర్ బాలికకు వలవేసి మాయమాటలతో వెంట తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీస్టేషన్‌లో కేసు నమోదయ్యిందని తెలిసీ ఊళ్లో వదిలి పరారయ్యాడు. ఈ సంఘటన యాలాల పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తాండూరు రూరల్ సీఐ జలంధర్ రెడ్డి యాలాల ఎస్ఐ శంకర్‌తో కలిసి వివరాలను వెల్లడించారు. యాలాల మండలం పగిడ్యాల గ్రామానికి చెందిన నీలీ ఆనంద్(23) ఐటీఐ చదువుతున్నాడు. గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను గత కొన్నిరోజులుగా ప్రేమ పేరుతో వెంబడి పడేవాడు. ఈనెల 9న బాలిక కోడంగల్ మండలం పెద్దనందిగామలోని ఆమె అమ్మమ్మ ఊరుకు వెళుతుందని తెలిసి ఆనంద్ కోడంగల్ వరకు వెంట వెళ్లి అక్కడ బాలికకు మాయమాటలు చెప్పి హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి యాదిగిరిగుట్టకు తీసుకెళ్లాడు. అదేరోజు రాత్రి అక్కడే ఓ రూము కిరాయికి తీసుకుని గడిపారు. మరోవైపు బాలిక కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈనెల 11న తనపై కేసు నమోదయ్యిందని తెలిసి బాలికను వెనక్కి తీసుకవచ్చాడు. యాలాలలో బాలికను వదిలి పారిపోయాడు. ఈ మేరకు పోలీసులు నిందితుడిని సోమవారం అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో రిమాండ్ చేసేందుకు తరలించారు.

