హై టెన్సషన్ మున్సిపల్ బడ్జెట్
– కోరం లేక సమావేశం అరగంట వాయిదా
– తరువాత బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్ల మద్దతు
– రూ. 60 కోట్ల 28 లక్షలతో అంచనా బడ్జెట్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ బడ్జెట్ సమావేశం తర్జన బర్జన మద్య ఆమోదం పొందింది. శుక్రవారం మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అధ్యక్షతన 2022-23 సంవత్సరానికి సంబంధించి రూ. 60 కోట్ల 28లక్షల 77 వేలతో బడ్జెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్‌తో పాటు ఈ సమావేశానికి మొదట టీఆర్ఎస్ నుంచి ఫ్లోర్ లీడర్ బొబ్బిలి శోభారాణి, మాజీ ఫ్లోర్ లీడర్ అబ్దుల్ రజాక్, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, సీనియర్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, కౌన్సిలర్లు ప్రవీణ్ గౌడ్, బోయరవి, వెంకన్నగౌడ్, రామకృష్ణ, సల్మా ఫాతిమా, చైర్ పర్సన్తో పాటు మొత్తం 10 మంది కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు బిడ్కర్ ఉశ, అబ్దుల్ ఖవిలు హాజరయ్యారు.
అర గంట సమావేశం వాయిదా, కొనసాగిన హైడ్రామా
అయితే బడ్జెట్ సమావేశానికి 36 మంది కౌన్సిలర్లు హాజరు కావాల్సి ఉండగా 25 మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. దీంతో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అర గంట సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ బడ్జెట్ సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ, ఎంఐంఎ కౌన్సిలర్లతో పాటు అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు కౌన్సిలర్లు దూరంగా ఉండడంతో బడ్జెట్ సమావే శంపై హైడ్రామా నెలకొంది.
వాయిదా వేసిన సమావేశం గడువు దగ్గర పడుతుండడంతో ఇరువర్గాల మద్య టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో సమావేశానికి హాజరైన అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్లు సమావేశం కొనసాగింపులో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తుదినిర్ణయమని పేర్కొని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్ల మద్దతు
సమావేశం ప్రారంభంలో హాజరైన టీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్ల మద్దతుతో బడ్జెట్ సమావేశాన్ని కొనసాగించారు. గడవు తీరుతున్న సమయంలోనే బీజేపీకి చెందిన సాహు శ్రీలత, ఎంఐఎం ఫ్లోర్డర్, మాజీ వైస్ చైర్మన్ సాజిద్ అలీలు సమావేశానికి హాజరయ్యారు. దీంతో సంఖ్యా బలం 12కు చేరడంతో 1/3వ వంతు నిబంధనతో బడ్జెట్ను ఆమోదించుకున్నారు. అయితే అప్పటికి ఈ సమావేశంలో అధికారులు తె కపోయినప్పటికీ మున్సిపల్ అకౌంటెంట్ సమక్షంలో బడ్జెట్ను ఆమోదించుకున్నారు. ఈ విషయాన్ని చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ స్వయంగా ప్రకటించారు.
రూ. 60 కోట్ల 28 లక్షలతో అంచనా బడ్జెట్..
సమావేశం అనంతరం చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మీడియాతో మాట్లాడారు. 2022-23 సంవత్సరానికి సంబంధించి రూ. 60 కోట్ల 28 లక్షల 77 వేల అంచనా బడ్జెట్ను 1/3వ వంతు కౌన్సిలర్ల నిబంధనతో అమోదించడం జరిగిందని తెలిపారు. ఇందులో గ్రీన్ బడ్జెట్కు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. విలీన కాలనీ అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. గత యేడాది బడ్జెట్తో పోలిస్తే ఈ సారి రూ. 4 కోట్లను తగ్గించడం జరిగిందని వెల్లడించారు. పలు కాలనీల్లో రోడ్లు, మౌళిక సదుపాయాల కల్పనకు కేటాయించడం జరుగుతుందని చెప్పారు. మరోవైపు బడ్జెట్ సమావేశంలో అధికారులు రాజకీయాలకు పాల్పడ్డారని చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మరోసారి ఆరోపించారు. కోరం లేని సమావేశానికి హాజరైన అధికారులు కోరం తరువాత గైర్హాజరు అయ్యారన్నారు. అధికారులు రిజిస్ట్రర్లను వెంట తీసుకెళ్లి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. సమావేశంలో కౌన్సిలర్లు, చైర్ పర్సన్ ఉన్నప్పటికి వెళ్లిపోవడం ఏంటని అడిగారు. కావాలనే రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్యే ఆదేశాలతో కౌన్సిలర్లు దూరం
మరోవైపు తాండూరు ఎమ్మెల్యే ఆదేశాలతోనే అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు దూరంగా ఉండిపోయారని చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ఆరోపించారు. మున్సిపల్ భవనం వరకు వచ్చిన కౌన్సిలర్లు సమావేశానికి కావాలనే గైర్హాజరు అయ్యారని అన్నారు. ఈ విషయంపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. గత యేడాది బడ్జెట్ను అడ్డుకున్నారని గుర్తుచేశారు. తాజాగా గత కౌన్సిల్ ఎజెండాపై కూడ రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ అభివృద్ధికి ఏమాత్రం అడ్డుకాదని స్పష్టం చేశారు. తన హక్కుల సాధన కోసమే కోర్టుకు వెళ్లడం జరిగిందని పేర్కొన్నారు.
చైర్ పర్సనైపై చర్యలు తీసుకోండి
బడ్జెట్ సమావేశం వాయిదా వేయడంపై ప్రతిపక్ష సీపీఎం ఫ్లోర్ ఆసీఫ్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, టీజేఎస్ ఫ్లోర్ లీడర్ సోమ శేఖర్, కాంగ్రెస్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్లు డిమాండ్ చేశారు. సమావేశం నుంచి బయటకు వచ్చిన అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్ ను – కలిసి మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన బడ్జెట్ సమావేశాన్ని రద్దు చేసి, చైర్ పర్సన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ మాట్లాడుతూ బడ్జెట్ సమావేశం వాయిదాపై చైర్ పర్సను అధికారం ఉందని, అరగంట తరువాత వాయిదా కొనసాగితే తదుపరి సమావేశంపై కూడ నిర్ణయం తీసుకునే అధికారం ఆమెకు ఉంటుందన్నారు.

