మూడు వాయిదాల్లో రాజీవ్ స్వగృహ ప్లాట్ సొంతం
– ఒకే వాయిదాలో చెల్లిస్తే 2 శాతం రిబీట్
– 14న ప్లాట్ల వేలం, 10లోగా డీడీలు చెల్లిస్తేనే అవకాశం
– ఫ్రీబిడ్ సమావేశంలో జిల్లా కలెక్టర్ కె.నిఖిల
తాండూరు, దర్శిని ప్రతినిధి : 90 రోజుల గడువులో మూడు వాయిదాలు చెల్లిస్తే రాజీవ్ స్వగృహా ప్లాట్ సొంతం చేసుకోవచ్చని వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిల పేర్కొన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రాజీవ్ స్వగృహ ప్లాట్లను బహిరంగ వేలం వేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాండూరులోని కోకట్ గ్రామ పరిధి హైదరాబాద్ రోడ్డు మార్గంలోని రాజీవ్ స్వగృహ ప్లాట్లను కూడ ఈనెల 14న వేలం వేస్తున్నారు. ఈ వేలంలో లబ్దిదారులకు కలిగే అనుమానాలను నివృత్తి చేసేందుకు ఫ్రీబిడ్ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం తాండూరు ఆర్డీఓ కార్యాలయం రెండో సారి ఫ్రీబిడ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కె.నిఖల సమావేశానికి హాజరై వేలంపై ప్రజలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజీవ్ స్వగృహాలో మనోహా టౌన్ షిప్ కింద నిర్మించిన 200 గజాలకు సంబంధించి 6 ఫ్లాట్లు, 250 గజాలకు సంబంధించి 5 ప్లాట్లు, 150 గజాలకు సంబంధించి 6 ప్లాట్లు మొత్తం 17 ప్లాట్లకు ఈనెల 14న వేలం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గజానికి రూ. 10 వేల చొప్పున ధరను నిర్ధారించినట్లు గుర్తుచేశారు. వేలంలో పాల్గొన దలచిన వారు ఈఎండీ కింద రూ. 10 వేలు డీడీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. అది కూడ ఈ నెల 10వ తేదీలోగా చెల్లించిన వారికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. వేలంలో ప్లాట్లను దక్కించుకున్న వారు 90 రోజులలో వాయిదా పద్ధతిన డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒకే సారి లేదా మూడు వాయిదా పద్ధతిలో చెల్లించాలన్నారు. 7 రోజులు ఒకసారి. 45 రోజులకు ఒకసారి. 90 రోజులకు ఒకసారి మొత్తం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ ఎవరైనా ఒకసారి ధరను చెల్లిస్తే అందులో 2శాతం రిబీట్ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. వేలంలో ఎలాంటి చిక్కులు లేని ప్లాట్లను లబ్దిదారులకు అందిస్తామని, నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుందని తెలిపారు. మరోవైపు కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ గతంలో ప్లాట్లను పరిశీలించిన 200 మందికి ఫోన్ చేసి మరోసారి క్లారిటీ ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్, ప్రాజెక్టు మేనేజర్ శ్రావణ్ కుమార్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

