తెలంగాణలో ఆప్ పాగా..!
– వచ్చేనెలలో తెలంగాణకు కేజ్రీవాల్
దర్శిని డెస్క్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం తరువాత ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఉత్సహాంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల విజయ ప్రభావాన్ని ఇతర రాష్ట్రాలపై చూపించేలా కసరత్తును ప్రారంభించింది. వచ్చే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడ పోటీ చేసేందుకు దృష్టి సారిస్తోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో వచ్చే ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలతోనే ఆమ్ ఆమ్మీ పార్టీ దక్షిణాదిలో పాగా చేయాలని ప్రయత్నిస్తోంది. ఇందంతా నిజమే అన్నట్లుగా వచ్చే నెలలో ఆప్ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలంగాణకు వస్తున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. వచ్చే నెలలో కేజ్రీవాల్ హైదరాబాద్‌లో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పాదయాత్ర ప్రారంభించనున్నట్లు పేర్కొన్నాయి. తెలంగాణ యువతతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల మద్దతును కూడగట్టుకునేందుకు కార్యాచరణ ఉంటుందన్నట్లుగా అందరు భావిస్తున్నారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపట్టే పాదయాత్రల కోసం కార్యాచరణ కమిటిని కూడ సిద్దం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

