గల్లిలో, ఢిల్లీలో దొంగ కొట్లాటలు..!
– పేదల నడ్డివిరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
– పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి
– తాండూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన
తాండూరు, దర్శిని ప్రతినిధి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గల్లి.. ఢిల్లీలో దొంగ కొట్లాలు చేస్తున్నాయని, పేదలపై ధరల భారం మోపి నడివిరుస్తున్నాయని తాండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. సోమవారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు టీపీసీసీ ఉపాధ్యక్షులు, తాండూరు ఇంచార్జ్ ఎం. రమేష్ మహారాజ్ ఆదేశాలతో డీసీసీ డెలిగేట్, జెడ్పీటీసీ ధారాసింగ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో వకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిరసనను భగ్నం చేసే ప్రయత్నం చేశారు.
అనంతరం డీసీసీ డెలిగేల్ ధారాసింగ్ పాటు పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ హాయంతో అందుబాటులోకి ఉన్న నిత్యవసర ధరలు టీఆర్ఎస్, బీజేపీ పాలనలో ఆకాశానికి అంటాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వాలు రాష్ట్రంలో, కేంద్రంలో కొట్లాటను పెట్టుకుంటూ దొంగాట ఆడుతున్నాయన్నారు. పెట్రోల్, డీజీల్, గ్యాస్, విద్యుత్, ఆర్టీసీ చార్జీల ధరలను పెంచి పేదల నడ్డి విరుస్తున్నాయన్నారు. తెలంగాణలో ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నా కేసీఆర్ కేంద్రంపై ఉద్యమం పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా పెంచిన ధరలను తగ్గించకుంటే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్కాపూర్ జనార్దన్ రెడ్డి, ఎంఎ ఆలీం, మాజీ డెలిగేట్ సభ్యులు సర్దార్ ఖాన్, కోర్వార్ నాగేష్, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, ఎంపీటీసీ రాజ్ కుమార్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, కార్యదర్శి రాము, నాయకులు బాతుల వెంకటయ్య, బాతుల భీంశంకర్, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

