అట్టహాసంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ
– ఆవిష్కరించిన వైస్ ఎంపీపీ స్వరూప వెంకట్రామ్ రెడ్డి
– కోటబాస్పల్లిలో విగ్రహావిష్కరణ సంబరాలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలం కోటబాస్పల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఆదివారం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన డీసీసీబీ మాజీ చైర్మన్ సిరిగిరిపేట్ సాయిరెడ్డి విగ్రహాన్ని అందించారు.
ఈ కార్యక్రమానికి తాండూరు వైస్ ఎంపీపీ స్వరూప వెంకట్రామ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గ్రామ సర్పంచ్ కుర్వ నాగార్జునతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు యువకులు పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ నెమలీగ సురేందర్ రెడ్డి, న్యాయవాది పట్లోళ్ల రాంరెడ్డి, ఉపసర్పంచ్ నర్సింలు, మాజీ వైస్ ఎంపీపీ మొగులప్ప, సీపీఎం నాయకులు శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బుగ్గప్ప, బీసీ సంఘం నాయకులు అబ్బని బసయ్య, గ్రామ కార్యదర్శి లాలప్ప, గ్రామ పెద్దలు వీరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


