లంచగొండి వైద్యుడిపై మంత్రి హరిష్ రావు వేటు
– ప్రజల ఫిర్యాదు మేరకు సస్పెండ్ చేసిన మంత్రి
– కొండాపూర్ ఆసుపత్రి అకస్మిక తనిఖీలో చర్యలు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్‌నెస్ కోసం వెళితే లంచాలను వసూలు చేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడిపై రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీష్ రావు వేటు వేశారు. సోమవారం హైదరాబాద్‌లోని కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మంత్రి హరీశ్‌రావు ఆస్పత్రికి వెళ్లి.. రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఇంతలో మంత్రి ఆసుపత్రికి వచ్చిన విషయం తెలుసుకున్న కొంత మంది మంత్రిని కలిశారు. ఆసుపత్రిలో డాక్టర్ మూర్తి అనే వైద్యుడు వద్దకు డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం వెళితే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వెంటనే మంత్రి హరీశ్‌రావు అక్కడికక్కడే విచారణ చేపట్టారు. ఈ క్రమంలో డాక్టర్ మూర్తి వసూళ్లకు పాల్పడుతున్నారని తేలడండంతో మంత్రి హరిష్ రావు ఆయనను అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.
సాధారణ డెలివరీలు పెంచాలి.
మరోవైపు మంత్రి హరిష్ రావు ఆసుపత్రిలోని గైనకాలజీ వార్డును కూడా మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. గైనకాలజీ వార్డుల్లో నిత్యం స్కానింగ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇందుకు అదనంగా మరో రెండు అల్ట్రా సౌండ్ యంత్రాలు పంపుతామని మంత్రి హామీ ఇచ్చారు. 60 శాతానికి పైగా సాధారణ డెలివరీలు కావడం పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంఖ్యను మరింత పెంచాలని హరీశ్‌రావు సూచించారు.


