కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలి
– బీజేపీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్
తాండూరు, దర్శిని ప్రతినిధి: పాఠశాలలు, అంగన్‌వాడి కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు పాటించేలా శ్రద్ద వహించాలని తాండూరు మున్సిపల్ 20 వ వార్డు కౌన్సిలర్ సంగీత ఠాకూర్ అన్నారు. శనివారం వార్డు పరిధి గాంధీనగర్‌లోని ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడి కేంద్రంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ పనులను కౌన్సిలర్ సంగీత ఠాకూర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల, అంగన్‌వాడి కేంద్రంలో కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యార్థులను చూసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి మాస్కులు ధరించేలా చూడాలన్నారు. ప్రతిరోజు శానిటైజర్ వినియోగించాలని, భౌతిక దూరం పాటిస్తూ పిల్లలను కూర్చోబెట్టాలన్నారు. అదేవిధంగా విద్యార్థులకు జలుబు, తలనొప్పి, జ్వరం లాంటివి ఉంటే పిల్లలను అడిగి తెలుసుకుని వైద్య సహాయం అందేలా చూడాలన్నారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
