కాంగ్రెస్‌లో కాక..!
– రాజీనామాకు సిద్దమవుతున్న ఎం.రమేష్ మహరాజ్..?
– సొంత పార్టీ నేతలతోనే ఇబ్బంది అంటూ ఆవేదన
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో కాక పుడుతోంది. తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షులుగా ఉన్న ఎం.రమేష్ మహరాజ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మీడియాలో వచ్చిన కథనం స్థానికంగా చర్చనీయాశం అయ్యింది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దేముల్ జెడ్పీటీసీ ధారాసింగ్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎం.రమేష్ మహరాజ్ సైతం పదవికి రాజీనామ చేస్తున్నట్లు వచ్చిన ప్రచారం పార్టీలో అలజడిని రేకేత్తిస్తోంది. దశాబ్దాల కాలంగా మహరాజ్‌ల కుటుంబం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. కుటుంబ వ్యవహారాల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు, స్వర్గీయ మాజీ మంత్రి చందు మహరాజ్ కుమారులు ఎం.నరేష్, ఎం.రాకేష్‌లు గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇందులో ఎం.నరేష్ మహరాజ్ టీఆర్ఎస్ను వీడీ బీజేపీలో చేరారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనారోగ్య కారణంగా ఎం.రమేష్ మహరాజ్ ఎమ్మెల్యే పోటీ నుంచి తప్పుకున్నారు. అనూహ్యంగా పైలెట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన విషయం, తరువాత ఆరు నెలలకే టీఆర్ఎస్ పార్టీలో చేరడం అందరికి తెలిసిందే. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న ఎం.రమేష్ మహరాజ్ కు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టింది. ఈ విషయాలు ఎలా ఉన్నా రాను రాను కాంగ్రెస్ పార్టీలో ఎం.రమేష్ మహరాజ్‌కు సొంత పార్టీ నేతలు సహకరించడం లేదని పుకార్లు ఉన్నాయి. పైగా పరోక్షంగా ఇబ్బందులు సృష్టిస్తున్నట్లు ఆయన సన్నిహితుల వద్ద వాపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ధారాసింగ్ పార్టీకి రాజీనామా చేయడంతో ఎం.రమేష్ మహరాజ్ అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడూ పార్టీ అధిష్టానం నుంచి కూడ సమయం, సహాకారం అందించక పోవడంతో నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసి.. సామాన్య కార్యకర్తగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు మీడియాలో కథనం వచ్చింది. ఈ సంఘటనతో హస్తంలో మరింత ముసలం ఏర్పడింది.

