తాండూరు ఎమ్మెల్యే స్థానంపై టీడీపీ దృష్టి

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు ఎమ్మెల్యే స్థానంపై టీడీపీ దృష్టి
– తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ పోటీ
– తెలంగాణలో ఉద్యమ కారులకు అన్యాయం
– టీడీపీ నియోజకవర్గ నాయకులు సయ్యద్ ముజీబ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు అసెంబ్లీ స్థానంపై తెలుగు దేశం పార్టీ గురి పెట్టిందని, పార్టీ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ చేత పోటీ చేయించి గెలిపిస్తామని ఆ పార్టీ నాయకులు సయ్యద్ ముజీబ్ అన్నారు. మంగళవారం తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నోట్ల వర్షం కురిపిస్తూ పాలన సాగిస్తోందని విమర్శించారు. రాష్ట్రం కోసం ఉద్యమించిన ఉద్యమ కారుల పట్ల సీఎం కేసీఆర్ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించారని అన్నారు. ఉద్యమ కారులెవ్వరికి నామినేట్ పోస్టులు ఇచ్చిన పాపాన పోలేదని ఆవేధన వ్యక్తం చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ నూతన అధ్యక్షులుగా నియామకమైన కాసాని జ్ఞానేశ్వర్ చేత తాండూరు అసెంబ్లీ స్థానానికి పోటీ చేయించేలా దృష్టిసారిస్తున్నామని పేర్కొన్నారు. ఆయన నాయకత్వాన్ని బలపరిచి తాండూరులో గెలిపించేందుకు బాధ్యతగా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా ఈనెల 10న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగే కాసాని జ్ఞానేశ్వర్ ప్రమాణ స్వీకారానికి తాండూరు నుంచి 50 వాహనాల్లో 500 మంది నేతలు, కార్యకర్తలను తరలించడం జరుగుతుందని తెలిపారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపి సన్మానిస్తామన్నారు. అంతకుముందు కాసాని జ్ఞానేశ్వర్‌ను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు దేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకవచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నయూమ్ అక్తర్, టీ. కృష్ణ, యువకులు తదితరులు పాల్గొన్నారు.