ట్రా‘ఫికర్’ తీర్చండి సార్..!
– పట్టణంలో ట్రాఫిక్ పోలీస్టేషన్ ఏర్పాటు చేయండి
– తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్‌కు టీపీవీఎఫ్ వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : చాలా రోజులుగా తాండూరు ప్రజలను వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యను తీర్చాలని తాండూరు పబ్లిక్ వాయిస్ ఫోరం(టీపీవీఎఫ్) ప్రతినిధులు కోరారు. బుధావరం తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్ ను టీపీవీఎఫ్ ప్రతినిధులు జిలాని, భాను పవార్, జే. ప్రకాష్ తదితరులు కలిసి వినతిపత్రం అందజేశారు. వ్యాపార కేంద్రంగా ఉన్న తాండూరులో రోజు రోజుకూ ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుందని తెలిపారు. తాండూరు మీదుగా కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రా ప్రాంతాలకు వాహనాల రాకపోకల రవాణా జరుగుతోందని అన్నారు. దీంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్, శివాజీ చౌక్, కూరగాయల మార్కెట్ ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు సతమతం అవుతున్నారని తెలిపారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పట్టణంలో ట్రాఫిక్ పోలీస్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. అధికారులు, సిబ్బందిని నియమించి.. నిత్యం పెట్రోలింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్ సానుకూలంగా స్పందించి ట్రాఫిక్ పోలీస్టేషన్ ఏర్పాటు అంశం పరిశీలనలో ఉందని, త్వరలోనే పోలీస్టేషన్ అందుబాటులోకి వచ్చే విధంగా దృష్టిసారిస్తామని హామి ఇచ్చారు. అనంతరం టీపీవీఎఫ్ ప్రతినిధులు డీఎస్పీని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీపీవీఎఫ్ ప్రతినిధులు మల్లు యాదవ్, రాము గౌడ్, వెంకటేష్ గౌడ్, శివ పరివార్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

