అవిశ్వాసంపై పాలి’ట్రిక్స్’..!
– క్యాంపు రాజకీయాలపై నజర్
– మున్సిపల్ అవిశ్వాసం నెగ్గెందుకు వ్యూహాలు
– ఆసక్తికరంగా మారుతున్న పరిణామాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలోని తాండూరు మున్సిపల్లో అసమ్మతి స్వరం పెరిగింది. చైర్ పర్సన్‌పై వ్యతిరేక కౌన్సిలర్లు అవిశ్వాసానికి దిగడంతో రాజకీయ రగడ మొదలైంది. మున్సిపల్ చైర్ పర్సన్ పదవి కాలం మూడేళ్లు పూర్తి చేసుకోవడంతో తెలంగాణ మున్సిపల్ కొత్త చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానాన్ని ప్రయోగించారు. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు ఆధ్వర్యంలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌పై అవిశ్వాసం పెట్టాలని జిల్లా కలెక్టర్‌కు తీర్మానాన్ని అందజేశారు. అవిశ్వాసం కోసం పట్లోళ్ల దీపా నర్సింలుకు వర్గంకు 24 మంది కౌన్సిలర్ల మద్దతు లభించింది. నివేధికను అందుకున్న జిల్లా కలెక్టర్ అవిశ్వాసంపై నిర్ణయం తీసుకోనున్నారు. కలెక్టర్ నిర్ణయంతోనే తేదిని నిర్ణయించి అవిశ్వాస సమావేశం నిర్వహిస్తారు. కొత్త చట్టం ప్రకారం అవిశ్వాస సమయంలో మొత్తం 36 మంది కౌన్సిలర్లకు గాను 2/3 వంతి మంది ఆమోదిస్తినే అవిశ్వాసం నెగ్గుతుందని, లేదంటే వీగిపోతుందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ వర్గాలు ఎవరికి వారు అవిశ్వాసం నెగ్గేందుకు సమాయత్తం అవుతున్నారు. నెగ్గాలని ఒకరు.. వీగిపోయేలా చేయాలని మరొకరు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే ఆయా వర్గాలకు చెందిన కౌన్సిలర్లను క్యాంపులకు తరలించాలని రాజకీయ ఎత్తులను ప్రారంభించారు. ఇప్పటికే చైర్ పర్సన్ తమ అనుకూల వర్గ కౌన్సిలర్లను విహార యాత్రకు తీసుకెళ్లాలని ఏర్పాట్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు వైస్ చైర్ పర్సన్ వర్గం వారు చైర్ పర్సన్ వర్గానికి చెందిన కౌన్సిలర్లను మచ్చిక చేసుకున్నట్లు.. క్యాంపుకు వెళ్లకుండా చేసేందుకు ప్రయత్నాలు చేసినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. అవిశ్వాసానికి ముందే తాండూరులో మున్సిపల్ రాజకీయ పరిణామాలు అసక్తికరంగా మారాయి.

