శరీరంలో రక్తాన్ని పెంచే జ్యూస్‌లు..!
– పండ్ల రసాలలో పోషకాలు పుష్కలం
– రోజూ తాగితే రక్తం కొరత దూరం
దర్శిని డెస్క్: మనం రోజూ తీసుకునే ఆహారంలో పోషకాలు లేకుంటే రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది. దానిని నియంత్రించేందుకు కొన్ని కూరగాయలు, పండ్ల రసాలను తీసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా మానవ శరీరంలో ఐరన్ లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతోందని వైద్యులు చెబుతున్నారు. రోజూ పండ్ల రసాలను తీసుకోవడం వల్ల ఐరన్ లోపం తగ్గి రక్తం శాతాన్ని పెంచుతాయని అంటున్నారు. మరి పోషకాలు పుష్కలంగా అందించే పండ్ల రసాలు ఏంటో తెలుసుకుని రోజు తాగండి..
పాలకూర – పైనాపిల్
శరీరంలో ఐరన్ లోపాన్ని తగ్గించుకోవాలంటే పాలకూర, పైనాపిల్ బెస్ట్ మెడిసిన్. ఎందుకంటే పాలకూర, పైనాపిల్‌లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఈ రెంటినీ కలిపి జ్యూస్ చేసుకుని తాగడం వల్ల ఐరన్ లోపాన్ని దూరం చేసుకోవచ్చు.
బీట్‌రూట్ జ్యూస్
బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. ఇది శరీరాన్ని డిటాక్స్ చేసి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. బీట్‌రూట్ రసంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొన్ని రోజుల పాటు బిట్ రూట్ రసం తాగితే ఐరన్ లోపం తొలగిపోతుంది.
కర్జూరపండ్లు, దానిమ్మ
ఐరన్ ఉత్తమ వనరులలో దానిమ్మ ఒకటి. మీరు ఐరన్ లేదా రక్తహీనతతో బాధపడుతుంటే దానిమ్మ, ఖర్జూరంతో చేసిన జ్యూస్ తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రసం పోషకాలతో నిండి ఉంటుంది. దానిమ్మపండు జ్యూస్ ను వేరుగా కూడా తయారు చేసుకుని తాగవచ్చు.
కిరదోసకాయ – అరటిపండు
కిరదోసకాయ, అరటి రెండూ ఐరన్ కు మంచి మూలాలుగా పరిగణిస్తారు. ఈ రెండింటి రసాన్ని విడివిడిగా లేదా కలిపి తాగవచ్చు. ఈ రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దోసకాయ, అరటిపండు రక్తాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి.
ఆలూ బుఖారా జ్యూస్
ఆలూ బుఖారా పండ్లలో ఐరన్ మంచి పరిమాణంలో ఉంటుంది. దీని జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని రక్తహీనత తొలగిపోతుంది. ఈ పండ్లలో ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది బలహీనత, అలసటను తొలగిస్తుంది.

