స్కాన్ చేస్తే కాయిన్స్..!
– కాయిన్ వెండింగ్ మిషన్లు వచ్చేస్తున్నాయ్
– కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న ఆర్బీఐ
దర్శిని డెస్క్: ఇప్పటి వరకు ఏటీఎం మిషన్ల ద్వారా నోట్లను డ్రా చేసుకున్నాం. ఇక కాయిన్స్(నాణేలు) డ్రా చేసుకునే వ్యవస్థను చూడబోతున్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం నగదును తీసుకునేందుకు ఏ విధంగానైతే ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయో.. నోట్లకు బదులు నాణేలు కావాలనుకునేవారికి ఈ కాయిన్ వెండింగ్ మెషిన్లు అందుబాటులోకి రానున్నాయి. నాణేలు కావాలనుకునేవారి కోసం కాయిన్ వెండింగ్ మెషిన్లను (Coin vending machine) తీసుకొస్తోంది. క్యూఆర్ కోడ్‌ను (QR code) స్కాన్ చేయడం ద్వారా మెషిన్ల నుంచి నాణేలను పొందొచ్చు. యూపీఐ ద్వారా బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును చెల్లించి నాణేలు పొందొచ్చు. నోట్లు లేకుండా నగదు నాణేల రూపంలో కావాల్సినవారు ఈ మిషన్ల ద్వారా పొందవచ్చు. ఇతర కాయిన్ వెండింగ్ మిషన్‌ల మాదిరిగా కాకుండా ఇది యూపీఐ వ్యవస్థ అనుసంధానంతో పనిచేస్తుంది. కాయిన్స్ కోసం నోట్లు ఇవ్వాల్సిన పనిలేదు. వినియోగదారులు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమకు కావాల్సిన నాణేలు, అవసరమైన డినామినేషన్‌లో పొందవచ్చు. తొలుత పైలట్ ప్రాజెక్టుగా ఈ క్యూసీవీఎంలను (క్యూఆర్ కోడ్‌బేస్డ్ కాయిన్ వెండింగ్ మెషిన్) 12 నగరాల్లోని 19 చోట్ల ఏర్పాటు చేస్తారు. రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్ వంటి ముఖ్యమైన కూడళ్లలో అందుబాటులో ఉంచుతారు. ఫలితాల ఆధారంగా క్యూసీవీఎంల ద్వారా నాణేలను అందుబాటులో ఉంచేలా బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేస్తామని ఆర్‌బీఐ పేర్కొంది. దేశంలోని 12 నగరాల్లో తొలుత ఈ వెండింగ్ మెషిన్లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఇవి అందుబాటులోకి వస్తే ప్రజలకు, వినియోగదారులకు చిల్లర సమస్యలు తొలగిపోతాయి.

