అవిశ్వాసాల టెన్షన్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అవిశ్వాసాల టెన్షన్..!
– నోటీసులకు, స్టేలకు సమీపిస్తున్న గడువు
– తర్జన భర్జన పడుతున్న అధికారులు, నేతలు
– చట్ట సవరణ బిల్లు అమోదంపైనే దృష్టి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లాలోని మున్సిపాల్టీలలో అవిశ్వాస తీర్మానాలపై టెన్షన్ నెలకొంది. రెండు మున్సిపాల్టీలలో మెజార్టీ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్లకు అందించిన నోటీసులకు గడువు సమీపిస్తుండడం.. ఇందుకు సవాలుగా చైర్ పర్సన్‌లు కోర్టు నుంచి తెచ్చుకున్న స్టేలకు కూడా గడువు సమీపిస్తుండడంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ చట్ట సవరణ బిల్లు ఇంకా ఆమోదం కాకపోవడంతో అటు అధికారులు, ఇటు నేతలు తర్జన భర్జన పడుతున్నారు.

వికారాబాద్‌ జిల్లాలోని వికారాబాద్‌ మున్సిపల్ చైర్ పర్సన్‌గా మంజుల రమేష్‌, తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్‌గా స్వప్న పరిమళ్‌లు కొనసాగుతున్నారు. గతనెలలో ఇద్దరు చైర్ పర్సన్‌లు మూడేళ్ల పదవి కాలం పూర్తి చేసుకోవడంతో కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం వారిపై అవిశ్వాస తీర్మానాలను ప్రకటించారు. వికారాబాద్‌లో కౌన్సిలర్ పుష్పలతారెడ్డి ఆధ్వర్యంలో మెజార్టీ కౌన్సిలర్లు ఆవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించగా తాండూరులో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు ఆధ్వర్యంలో మెజార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం చేశారు. సొంత పార్టీ నుంచి పెట్టిన అవిశ్వాస తీర్మానానికి తాండూరులో ప్రతిపక్ష కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. గత నెల జనవరి 28వ తేదిన వికారాబాద్‌, తాండూరు మున్సిపాల్టీలకు సంబంధించి ఒకే రోజు ఇద్దరు చైర్‌ పర్సన్‌లపై అవిశ్వాసం ప్రకటించి జిల్లా కలెక్టర్‌కు నివేదికలను అందజేశారు.

హైకోర్టుల నుంచి స్టే
మెజార్టీ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొనేందుకు వికారాబాద్, తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్‌లు ధీటుగా ప్రణాళికలు చేసుకున్నారు. అవిశ్వాసం ప్రకటించిన వెంటనే ఇద్దరు చైర్ పర్సన్‌లు హైకోర్టు నుంచి స్టేలు తెచ్చుకున్నారు. అవిశ్వాస తీర్మానాల ఆమోదం నిబంధనలను ఇంకా రూపొందించలేదని వాదనల సందర్భంగా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి స్టేలు తీసుకవచ్చారు. దీంతో ఈనెల 21 వరకు అవిశ్వాసాలపై విధించిన స్టేకు గడువు సమీపిస్తోంది. అదేవిధంగా అవిశ్వాసాలపై మెజార్టీ కౌన్సిలర్లు ఇచ్చిన నోటీసుకు 25 నుంచి 30 రోజుల వ్యవధిలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలి. ఈక్రమంలో అధికారులు కూడ అవిశ్వాస తీర్మానంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అని యోచిస్తున్నారు.    ఇంకా.. వుంది.. చదవండి..

బిల్లు ఆమోదంపై దృష్టి
అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు వ్యవధిని మరో ఏడాది పొడిగించాలంటే అందుకు సంబంధించిన బిల్లుకు గవర్నర్‌ నుంచి ఆమోదం రావాల్సి ఉంది. పురపాలక సంఘాల ఛైర్‌పర్సన్లు, నగరపాలక సంస్థల మేయర్లపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు గతంలో మూడేళ్ల గడువు ఉండగా.. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లకు పెంచింది. ఆమేరకు చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి.. చట్టబద్ధత కల్పించేందుకు గవర్నర్‌ ఆమోదం కోసం పంపింది. గవర్నర్‌ ఇంకా ఆమోదించకపోవడంతో గడువు పెంపు అమలులోకి రాలేదు. చట్ట సవరణ నేపథ్యంలో అవిశ్వాస తీర్మాన నిబంధనలను మున్సిపల్‌ వ్యవహారాల శాఖ ఇంతవరకు రూపొందించలేదు. ఈ నిబంధనలనే నూతన చట్టంలోనూ పేర్కొనాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. త్వరలో గవర్నర్‌ నుంచి ఆమోదం లభిస్తుందన్న ఆశాభావంతో అధికారులు ఉన్నారు. దీంతో బిల్లు ఆమోదంపై కూడా అందరి దృష్టి పడింది.

నిపుణులు ఏమంటున్నారంటే..
అయితే.. బిల్లు ఇంకా గవర్నర్‌ ఆమోదం పొందని నేపథ్యంలో పాత చట్టం అమలులో ఉన్నట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు. దీనిపై నిపుణుల అభిప్రాయాలనూ సేకరిస్తున్నారు. ఈ వారం చివరిలోగా నిబంధనలను రూపొందించి న్యాయస్థానంలో ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు సిద్దమవుతోంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకు మున్సిపల్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని అధికారులకు ఇవ్వాలంటే కనీసం 50 శాతం మంది కార్పొరేటర్లు సంతకాలతో నోటీసు ఇవ్వాలి. మూడింట రెండొంతుల మంది సభ్యులు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేస్తేనే తీర్మానం ఆమోదం పొందుతుంది.