సీపీఆర్‌తో ప్రాణ రక్షణ
– అవగాహన పెంచుకోవడం సామాజిక బాధ్యత
– తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఆగిపోతున్న గుండెకు సీపీఆర్‌తో ప్రాణాలను రక్షించవచ్చని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్యబృందం మంగళవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో అధికారులకు, సిబ్బందికి సీపీఆర్ విధానంపై అవగాహన కల్పించారు. వైద్య బృందం గుండె పోటుకు గురైన వారికి ఎలాంటి వైద్య సేవలు అందించాలో ఓ బొమ్మ ద్వారా వివరించారు. ఈ పద్దతులతో సీపీఆర్ ఏలా పనిచేస్తోందో చూపించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ గుండెపోటు వచ్చిన వారికి సత్వరమే ప్రాథమిక చికిత్స అందించాలనే ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం సీపీఆర్‌పై శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గుండె పోటుకు గురైన వ్యక్తికి సరైన వైద్యం అందేవరకు సీపీఆర్ చేయడం ద్వారా 90 శాతం ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందన్నారు. సీపీఆర్ విధానంపై అందరు అవగాహన పెంచుకోవడం సామాజిక బాధ్యత అని అన్నారు. ఆపద సమయాల్లో ఎవరు ఎవరికైనా సీపీఆర్ చేయొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి, అబ్దుల్ రజాక్, బోయరవి, రాము, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, మెప్మా సిబ్బంది, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

