టెన్త్ ఎగ్జామ్ ఆన్సర్ పేపర్ బెండల్ గయాబ్
– 20 మంది విద్యార్థుల జవాబు షీట్‌ల మిస్సింగ్
– అధికారుల నిర్లక్ష్యమంటూ తల్లిదండ్రుల మండిపాటు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణలో ఓ వైపు టెన్త్ పరీక్షా పత్రాలు లీకేజీలు కలంకలం రేపుతుంటే.. మరో వైపు పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల ఆన్సర్ బెండల్ గయాబ్ అయిన సంఘటన మరింత సంచలనంగా మారింది. మొదటి రోజు వార్షిక పరీక్షలు విద్యార్థల ఆన్సర్ షీట్ బెండల్స్ మిస్సింగ్ అయిన సంఘటన రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉట్నూరులో పరీక్ష రాసేందుకు 1,011 మంది విద్యార్థులకు అయిదు కేంద్రాలను ఏర్పాటుచేశారు. అయితే తెలుగు పరీక్ష రాసిన విద్యార్థుల జవాబు పత్రాల్లో ఒక కట్ట మాయమైనట్లు గుర్తించారు.
జవాబుపత్రాలను ఆయా కేంద్రాల బాధ్యులు తపాలా కార్యాలయంలో అప్పజెప్పారు. అక్కడి సిబ్బంది పత్రాలన్నింటినీ 11 కట్టలుగా విభజించి మూల్యాంకన కేంద్రాలకు తరలించేందుకు బస్టాండ్‌కు ఓ ఆటోలో తీసుకొచ్చారు. బస్సులో వేసే ముందు మరోసారి కట్టలను లెక్కించారు. 11 బదులు పది కట్టలే ఉండడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో విషయం తెలుసుకున్న ఎస్.ఐ. భరత్ సుమన్ పరీశించారు. దాదాపు 20 మంది విద్యార్థుల జవాబు పత్రాలు కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. ఆ పేపర్లు ఆటోలో తరలిస్తుండగా కిందపడిపోయాయా? లేక ఎవరైనా కావాలనే చోరీ చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇక ఆన్సర్ షీట్ మిస్సింగ్ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జవాబు పత్రాల కట్ట కోసం ప్రధాన రహదారితోపాటు అన్ని ప్రాంతాల్లోనూ వెతికారు. అది దొరక్కపోవడంతో తపాలా కార్యాలయ సబ్ పోస్టుమాస్టర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ. వెల్లడించారు. దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని, విద్యార్థుల భవిష్యత్తు ఏమిటని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దర్యాప్తు ఆధారంగా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

