అవినీతి మాజీ ఆర్పీ ఆటలు సాగనివ్వం
– బీఆర్ఎస్ నాయకులు ఈర్షాద్
– పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ సంఘాల సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అవినీతి పాల్పడిన మాజీ ఆర్పీ ఆటలు సాగనివ్వమని తాండూరు పట్టణ బీఆర్ఎస్ యువనాయకులు ఈర్షాద్ అన్నారు. గురువారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ కాలనీకి చెందిన మాజీ ఆర్సీ జయశ్రీ మళ్లీ ఆర్పీగా ఉద్యోగంలో చేరేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. గతంలో కాలనీకి చెందిన దాదాపు 24 మహిళ సంఘాల నుంచి వడ్డీ రుణాలు, స్త్రీనిధి రుణాల్లో అవినీతి పాల్పడ్డారని అన్నారు. ఆయా సంఘాల నుంచి సుమారు రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు అవినీతి చేశారని ఆరోపించారు. కొన్నేళ్ల క్రితం దీనిపై తాండూరు ఆర్డీఓ అదేశాల మేరకు విచారణ చేసిన అధికారులు ఆమెను విధుల్లో నుంచి తప్పించారని గుర్తుచేశారు. తాజాగా జిల్లా కలెక్టర్, మెప్మా అధికారులను కలిసి మళ్లీ ఉద్యోగంలో చేరేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. ఆర్పీగా సక్రమంగా విధులు నిర్వహించకుండా రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. స్థానిక కౌన్సిలర్ కుటుంభీకులు కూడ ఆమెకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. అవినీతికి పాల్పడిన ఆర్పీని మళ్లీ తీసుకోవద్దని మహిళ సంఘాలు వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. మహిళ సంఘాలకు అండగా ఉంటామని, అవినీతి ఆర్పీ ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు. మరోవైపు బాధిత మహిళ సంఘాల సభ్యులు మాజీ ఆర్పీ చేసిన అవినీతిపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.



