ఉరేసుకుని అస్సాం కార్మికుడి మృతి
– తాండూరు ఆర్అండ్బి ఆఫీస్ వద్ద ఘటన
– దర్యాప్తు చేస్తున్న పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అస్సాంకు చెందిన ఓ కార్మికుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం తాండూరు ఆర్అండ్బి కార్యాలయ సమీపంలో చోటు చేసుకుంది. తాండూరు ఎస్ఐ మహిపాల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అస్సాం రాష్ట్రం బర్పేట్ జిల్లాకు చెందిన గఫూర్ అలీ కుమారుడు అస్లాం అలీ(25) గత కొన్ని నెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన కొంత మంది కార్మికులతో కలిసి తాండూరులో సీసీ రోడ్డు పనుల కోసం కార్మికుడుగా వచ్చాడు. పాపిరెడ్డి అనే కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తూ స్థానిక ఆర్ అండ్ బి కార్యాలయ సమీపంలో ఉన్న ఓ గదిలో ఉంటున్నారు. బుధవారం అస్లాం అలీ పనులకు వెళ్లకుండా సెలవు తీసుకున్నాడు. గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం గమనించిన స్థానికులు తాండూరు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ ఎస్ఐ మహిపాల్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ మహిపాల్ రెడ్డి తెలిపారు. కాగా మృతుని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.


